నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన .. “వైఎస్ఆర్ పేరు ఉపయోగించుకోవడం” అనే అంశంతో మాత్రం వైసీపీనే ఇబ్బంది పడుతోంది. వైఎస్ఆర్ పేరు ఉపయోగించుకునే హక్కు తమకే ఉందంటూ.. ” అన్నా వైఎస్ఆర్ పార్టీ ” అధ్యక్షుడు భాషా ఢిల్లీలో ఉండి మరీ పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. నేరుగా ఎన్నికల కమిషన్ను కలిసి పిటిషన్ సమర్పించిన ఆయన… ఇప్పుడు నేరుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారని.. పిటిషన్లో భాషా తెలిపారు.
గతంలో ఎన్నికల సంఘం కూడా.. వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకోవద్దంటూ.. పలుమార్లు నోటీసులు పంపిందని.. తమకు మాత్రమే.. వైఎస్ఆర్ పేరు వాడుకునే హక్కు ఉందని తేల్చి చెప్పిందని పిటిషనర్ చెబుతున్నారు. ఆయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు… వైఎస్ఆర్ పేరుతో.. లెటర్ ప్యాడ్లు తయారు చేయడమే కాదు.. అన్ని రకాల అధికార ఉత్తర, ప్రత్యుత్తరాల్లో అదే వాడుతున్నారని… ఆరోపిస్తున్నారు. ఎన్నిక సంఘం నిబంధనలు ఉల్లంఘించి.. తమ పార్టీ హక్కులను కాలరాస్తున్నందున.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని… అన్న వైఎస్ఆర్ పార్టీ నేతలు కోరుతున్నారు.
రఘురామకృష్ణంరాజు వివాదం బయటకు రానంత కాలం వరకూ.. అన్న వైఎస్ఆర్ పార్టీ ఉందనే సంగతే ఎవరికీ తెలియదు. ఆయన తనకు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఇవ్వడంతో… అదే అవకాశం అనుకున్న అన్న వైఎస్ఆర్ పార్టీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ మాత్రం చాలు తాము దున్నేస్తమని అన్న వైఎస్ఆర్ పార్టీ నేతలు.. కోర్టుల వరకూ వెళ్తున్నారు. సాంకేతికంగా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ అనే పేరు వాడుకునే అవకాశం లేదు. ఈ విషయాన్ని న్యాయనిపుణులు కూడా స్పష్టం చేయడంతో.. విజయసాయిరెడ్డి లాంటి నేతలు.. తమ సోషల్ మీడియా బయోల్లో కూడా.. పార్టీపూర్తి పేరు పెట్టుకుంటున్నారు. త్వరలో.. అన్ని చోట్లా… పార్టీపూర్తి పేరు పెట్టేలా చర్యలు తీసుకోకపోతే.. చిక్కులు ఏర్పడతాయని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. అయితే.. వైఎస్ఆర్ పేరు వాడలేకపోవడం అంటే.. తమకు నైతికంగా దెబ్బ పడినట్లు అవుతుందని… వారే ఇబ్బంది పడుతున్నారు. పార్టీని ధిక్కరించిన రఘురామకృష్ణరాజుని … వైసీపీ ఎంత ఇబ్బంది పెడుతుందో కానీ.. ఎంపీ మాత్రం.. వైసీపీని ఊహించని విధంగా చికాకు పెడుతున్నారు.