కొత్త సచివాలయం నిర్మాణం కోసం.. పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు సోమవారం వరకూ ఆపాలని ఆదేశాలు ఇచ్చింది కానీ.. అప్పటికే నాలుగు రోజులు కావడంతో.. కీలకమైన భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు అందరూ దర్శించుకునే నల్లపోచమ్మ గుడి.. ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలు చేసే మసీదు కూడా ధ్వంసమయ్యాయి. అయితే.. ఈ సంగతి బయటకు రాకుండా.. ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత బయటపడుతుందని అనుకున్నారేమో కానీ.. కేసీఆర్.. వాటిని మళ్లీ నిర్మిస్తామని ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాతే.. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ గుడి.. మసీదు ధ్వంసం అయ్యాయని బయటకు తెలిసింది. దాంతో.. రాజకీయం ప్రారంభమయింది.
నల్లపోచమ్మ గుడిని ఎలా కూలగొట్టారో.. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది గుళ్లు కూలగొట్టడానికి కాదని మండిపడ్డారు. అసలు సిసలైన హిందువు తానేనంటూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించుకున్నారని, కానీ నేడు.. ఆయన గుడి మనిషి కాదని తేటతెల్లమైపోయిందని మురళీధర్ రావు మండిపడ్డారు. ఇతర బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలు కూడా.. గుడిని కూలగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా.. మూఢ నమ్మకాలతో.. కొడుకును సీఎంను చేయడానికి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
మరో వైపు.. మసీదు ధ్వంసం విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాజిటివ్‌గా స్పందించారు. కేసీఆర్ మళ్లీ నిర్మిస్తామన్న ప్రకటనను స్వాగతించారు. సాదారణంగా.. ఎలాంటిదైనా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… మసీదు లాంటి వాటిపై… తొలగింపు లాంటి కారణాలతో చేయి వేస్తే… ఓవైసీల స్పందన వేరుగా ఉంటుంది. పరిస్థితి మారిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం.. దశాబ్దాలుగా ఉన్న మసీదును తొలగించేసి.. వేరే చోట కొత్తది కడతాం అని కేసీఆర్ అనగానే.. ఓకే ..ఓకే అనేశారు ఓవైసీ.