వెరీజ్ కేసీఆర్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడికి బ్రేక్ పడింది. ఫామ్‌హౌస్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రెండు వారాల కింద.. ప్రగతి భవన్లో ఉన్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయడంతో 30 మందికి పాజిటివ్ గా తేలింది. అప్పుడు ప్రత్యేకంగా ప్రగతిభవన్‌ను శానిటైజ్ చేశారు. ఆ సమయంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లిన కేసీఆర్.. ఐసోలేషన్ పిరియడ్‌గా పరిగణించే పధ్నాలుగు రోజులు పూర్తయిన తర్వాత మళ్లీ ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ రెండు వారాల కాలంలో.. ఆయన ఆచూకీపై చాలా పెద్ద చర్చ జరిగింది. కొంత మంది హైకోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల రూమర్లను కూడా ప్రచారంలోకి తీసుకువచ్చారు.
వీటన్నింటికీ తెరదించుతూ.. కేసీఆర్ ప్రగతి భవన్‌కు రావడంతో.. విపక్షాల విమర్శలు తేలిపోయినట్లయింది. కేసీఆర్ ఆదివారం నుంచి రోజువారీ సమీక్షలు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కట్టడితో పాటు.. ఫామ్ హౌస్‌లో ఉండగా… జగిత్యాల జిల్లా రైతులకు ఫోన్ చేసి… ప్రగతి భవన్లో కలుద్దామని సూచించారు. ఆ భేటీని కూడా అధికారులు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే సచివాలయం కూల్చివేత అంశంపైనా … న్యాయ వివాదాలపైనా.. అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రెండు వారాల పాటు.. రాజకీయంగాచర్చనీయాశం అయిన కేసీఆర్ అదృశ్యానికి తెరపడినట్లయింది.
కేసీఆర్.. కీలకమైన సమయాల్లో మౌనం పాటించడమో.. కనిపించకుండా.. ఉండటమో చేస్తూ ఉంటారు. ఉద్యమ సమయంలోనూ అంతే. ఆ సమయంలో.. చాలా జరుగుతాయి. కానీ ఆయన తెర ముందుకు వచ్చి… వాటన్నింటినీ దూది పింజల్లా తేలిపోయాలా చేస్తారు. ఆ వ్యూహాన్ని అమలు చేయడంలో కేసీఆర్ ఆరితేరిపోయారు. ఇప్పుడు.. ఆయన అదృశ్యం .. కరోనా కట్టడిలో వైఫల్యం అంటూ చేసిన విమర్శలకు.. రేపోమాపో పెట్టే ప్రెస్‌మీట్‌తో రెండు, మూడు మాటలతోనే తిరగ్గొట్టేస్తారు కేసీఆర్. అది ఆయనకు అలవాటైన పని మరి..!