రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును కూడా ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోయింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనని తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 84, 11వ షెడ్యూల్లో 7వ పేరాను ఉల్లఘిస్తుందని కేఆర్ఎబీ చెబుతోంది.
ఏపీ నీటిని ఏపీ అవసరాలకు వాడుకుంటామని.. ఎవరి అనుమతులు అక్కర్లేదని.. ఏపీ సర్కార్ వాదిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి వాటిని వీలైనంత గోప్యంగా ఉంచి.. నిధులు కేటాయించి.. పనులు చేయించుకుంటారు. ఎగువ రాష్ట్రాలే ఆ పనులు చేస్తూంటాయి. అయితే.. దిగువ రాష్ట్రమైన ఏపీ ఈ విషయంలో లేనిపోని ప్రచారానికి పోవడంతో.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రాజకీయ అంశమైంది. ఫలితంగా.. రెండు రాష్ట్రాల్లోనూ… మళ్లీ జల వివాదాలు వచ్చాయన్న అభిప్రాయం ఏర్పడింది. రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు… మామూలుగానే ఉండటంతో.. వివాదం.. అపెక్స్ కౌన్సిల్ వద్దకు వెళ్లింది.
రాయలసీమ ఎత్తిపోతల అక్రమమేనని.. కేఆర్ఎంబీ నేరుగా.. ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపింది. బీజేపీకి చెందిన నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. పీఎంవోకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పీఎంవో… కేఆర్ఎంబీకి పంపింది. దానికి స్పందనగా.. కృష్ణా రివర్ బోర్డు… ప్రాజెక్ట్ పరిస్థితిని పీఎంవోకు తెలియచేసింది. ఇదే స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో… రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం ఇక కష్టమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం.. కట్టి తీరాలన్న లక్ష్యంతో ఉంది.