కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఆధారాలు బయటపడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో… ఎక్కువగా రెడ్డి సామాజికవర్గానికి.. కాపుల పేరుతో.. క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తారు. కడప జిల్లాల్లో అది ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాలో కాపు నేస్తం పొందిన వారిలో అత్యధికులు అలాంటి లబ్దిదారులేనని విమర్శలు ఉన్నాయి. అనూహ్యంగా కర్నూలు జిల్లాలోనూ అంతే అని తాజాగా బయటపడింది.
కర్నూలు జిల్లాలో ఒక్క మండలంలో.. రెండు గ్రామాల్లో లబ్దిపొందిన వారి జాబితా వెలుగులోకి వచ్చింది. బండిఆత్మకూరు మండలంలో లింగాపురం, జీసీపాలెం గ్రామాల్లో 22 మందికి ఈ పథకం ద్వారా లబ్ది కలిగింది. అందులో.. అత్యధికం రెడ్డి సామాజికవర్గం వారే. మహిళల పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో అక్రమంగా తమ పేర్లను చేర్పించుకున్నారు. కానీ ఆధార్ వివరాల్లో మాత్రం.. భర్తల పేర్లు బయటపడ్డాయి. అత్యధిక రెడ్డి సామాజికవర్గానికి కాపు నేస్తం నిధులు అందాయి. ఈ విషయం బయటపడటంతో.. గ్రామాల్లో కలకలం రేగుతోంది.
కేవలం రెండు మండలాల్లో లబ్దిదారులు అయిన 22 మందిలో.. 18 మంది వరకూ.. రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు… అంటే.. మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. ఊహించుకోవచ్చన్న అభిప్రాయం.. అందరిలోనూ ఏర్పడుతోంది. పథకం పూర్తిగా పక్కదారి పట్టిందని.. వాలంటీర్ల సర్వే.. ఇతర అంశాల ఆధారంగా.. వైసీపీ నేతలు ఒక్క సామాజికవర్గానికి మాత్రమే మేలు చేశారని.. దీని ద్వారా నిరూపితమయిందని అంటున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాలకు ఆర్థిక చేయూత అందిస్తామంటూ.. జగన్ పథకాన్ని ప్రారంభించారు. చివరికి ఇది రెడ్డి సామాజికవర్గ పథకంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది.