సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి ఉదంతాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈటీవీ లో పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో కెమెరామెన్ అని ప్రచారం చేసుకుంటున్న రావణ్ భిక్షు అనే వ్యక్తి తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు టీవీ చానల్స్ ని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..
రావణ భిక్షు అనే వ్యక్తి, తాము సినిమా తీయబోతున్నమంటూ పలువురిని నమ్మించాడు. “ఆత్రేయపురం ప్రేమ కథ” అన్న టైటిల్ ఈ సినిమాకి ప్రకటించాడు. చైతన్య అనే బ్యానర్ సైతం స్థాపించాడు. అమరావతి శైవ క్షేత్రం లో త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అని ప్రచారం చేసుకున్నాడు. సినిమాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి గల యువతీ యువకులు తనను సంప్రదించవచ్చు అంటూ ప్రచారం చేసుకున్నాడు. తనను సంప్రదించిన వారి దగ్గర, 30 వేల రూపాయల మొదలుకొని, వారి తాహతును బట్టి, వారికి ఇస్తానన్న పాత్రను బట్టి డబ్బులు భారీగా వసూలు చేశాడు. కొంతమంది యువతులను లైంగిక వేధింపులకు సైతం గురిచేశాడు. అయితే తమను రావన్ బిక్షు మోసం చేసాడని గ్రహించిన యువతీ యువకులు పోలీసులను, టీవీ చానల్స్ ను ఆశ్రయించారు. బాధితుల్లో చాలా వరకు గుంటూరు విజయవాడ బెల్ట్ మధ్య ఉన్న ప్రాంతానికి చెందిన వారని సమాచారం.
అయితే ఈ రావణ్ భిక్షు నిజంగానే జబర్దస్త్ కార్యక్రమం లో పని చేశాడా, అతనితో పాటు ఈ మోసం లో ఇంకెవరు ఉన్నారు, మొత్తం అంతా కలిపి ఎంత వసూలు చేశారు అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.