ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రెస్‌నోట్ ద్వారా మీడియాకు చెప్పారు. కానీ.. అసలు విషయం వేరే ఉందని.. విశ్వసనీయంగా తెలుస్తోంది. కేంద్రం ఆర్థిక సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ… అమెరికా నుంచి ఓ ప్రైవేటు సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 9 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపుగా రూ. అరవై ఐదు వేల కోట్లు అప్పు ఇస్తానంటోందని… దానికి సావరిన్ గ్యారంటీ ఇస్తే చాలునని.. ఆర్థిక మంత్రి బుగ్గన… బుట్టలో ప్రసాదాలు, విగ్రహాలు పెట్టుకెళ్లి మరీ అడిగినట్లుగా తెలుస్తోంది. బుగ్గన నిర్మలా సీతారామన్‌తో పాటు.. ఆమె డిప్యూటీ అనురాగ్ ఠాకూర్.. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. లాంటి వాళ్లను కూడా కలిసి.. సావరిన్ గ్యారంటీ కోసం.. ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు.
ఏపీ సర్కార్‌కు అమెరికా ప్రైవేటు సంస్థ రూ. 65వేల కోట్ల అప్పు..!?
ఓ వైపు జీతాలకే డబ్బుల్లేని ఆర్థిక పరిస్థితి. ఆర్బీఐ ఎఫ్ఆర్బీఎం పరిమితి ఐదు శాతానికి పెంచింది. ఎంత చాన్స్ వస్తే .. అంత అప్పుడు తీసుకుంటూ పథకాలు అమలు చేస్తూ కాలం గడపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. అమలు చేయాల్సిన పథకాలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ సర్కార్‌కు.. తాము అప్పు ఇస్తామంటూ.. ఓ అమెరికన్ ప్రైవేటు ట్రస్ట్ ముందుకు వచ్చింది. అది కూడా.. వందల కోట్లలో కాదు.. వేల కోట్లలో., 9 బిలియన్ డాలర్లు ఇస్తామంటోంది. అంటే.. రూ. 65వేల కోట్లు. మామూలుగా ప్రభుత్వాలకు… అప్పులు ఇచ్చే సంస్థలు… ప్రభుత్వాలకు సంబంధించినవే అయి ఉంటాయి. కానీ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అప్పు ఇస్తామన్న అమెరికా ట్రస్ట్ మాత్రం.. పూర్తిగా ప్రైవేటు. అ ట్రస్ట్ పేరు ఏమిటో కూడా ఇంత వరకూ బయటకు రాలేదు.
రూ. 65వేల కోట్లు అప్పివ్వగలిగే ప్రైవేటు ట్రస్ట్ ఎవరిది..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలే అప్పులు ఇవ్వట్లేదు. ఆర్థిక నిర్వహణ దారుణంగా ఉందన్న అభిప్రాయం… ఆయా సంస్థల్లో ఉంది. సంపద సృష్టించే ప్రయత్నాలు లేకపోవడం.. మొత్తం అనుత్పాదక వ్యయమే చేస్తూండటంతో.. ఆర్థిక సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. అదే సమయంలో.. ఏపీ అప్పుల భారం అపరిమితంగా ఉంది. ఇక కరోనా కాలంలో ప్రభుత్వ సంస్థలు కానీ.. ప్రైవేటు సంస్థలు కానీ… ఎవరికైనా అప్పులివ్వలాంటే.. సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. అమెరికా నుంచి ఓ ప్రైవేటు ట్రస్ట్ ప్రభుత్వానికి రూ. 65వేల కోట్లు అప్పు ఇస్తామంటూ ముందుకు వచ్చిందని.. దానికి అనుమతి.. గ్యారంటీ కావాలని… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రం వద్దకు రాయబారానికివెళ్లారన్న ప్రచారం ఇప్పుడు.. ఎన్నో సందేహాలను రేకెత్తిస్తోంది. ఆ ప్రైవేటు ట్రస్టు.. అంత పెద్ద మొత్తంలో అప్పు ఏపీకి ఎందుకు ఇవ్వాలనుకుంటోంది..? ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు..? ఇంతకీ ఆ ట్రస్ట్ ఎవరిది..? ఆ ట్రస్ట్‌కు నిధులు ఎలా వస్తాయన్నది ఎవరికీ అంతుబట్టని విషయాలుగా మారాయి.
చట్టాల గురించి బుగ్గనకు తెలియదా..? తెలిసే ప్రయత్నం చేస్తున్నారా..?
ఇతర దేశాల నుంచి మన దేశంలోకి నిధులు రావాలంటే.. అది అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదు. అప్పులైనా సరే.. దానికి పక్కా లెక్కలు ఉండాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు కావాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రైవేటు ట్రస్ట్ నుండి అంత పెద్ద రుణం.. ఏపీ సర్కార్ తీసుకోవడానికి అవకాశం లేదు. అంతే కాదు.. దానికి కేంద్రం అనుమతి కూడా ఇవ్వదు. ఇక గ్యారంటీ ఇచ్చే అవకాశం కూడా లేదు. బుగ్గన తీసుకొచ్చిన ప్రతిపాదన చూసి.. ఆర్థిక మంత్రి.. డిప్యూటీ మంత్రి కూడా.. ఆశ్చర్యపోయారు. వారు.. పరిశీలిస్తామని చెప్పారు కానీ.. హామీ ఇప్పిస్తామనే హామీని మాత్రం ఇవ్వలేదు. ఒక వేళ అంత పెద్ద మొత్తం ఏపీ సర్కార్ అనుమతి తీసుకోవాలనుకున్నా… ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతి ఇస్తోంది. ఏపీ సర్కార్ ఇప్పటికే ఆ పరిమితికి మించి వాడుకుంది.
జగన్మోహన్ రెడ్డి సర్కార్.. తొలి ఏడాదిలోనే రూ. 80వేల కోట్ల అప్పు చేసిందని.. విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంత పెద్దమొత్తంలో ఖర్చు పెట్టి చేసిన అభివృద్ధి పనులు కూడా ఏవీ లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా..,మూడు నెలల్లో రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అవన్నీ.. ఆర్బీఐ అనుమతితో తెచ్చుకున్నవే. కానీ ఇప్పుడు ఏకంగా ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ. 65వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సావరిన్ గ్యారంటీ అడుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు.. ప్రభుత్వం చెబితేనే బయటకు రావాల్సి ఉంది..!