ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తాను తప్పుకుంటున్నాను అంటూ నిన్న రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసిన ముద్రగడ, ఇప్పుడు ఇంత హఠాత్తుగా తాను ఉద్యమం నుండి తప్పుకుంటానని ప్రకటించడం వెనుక కారణాలపై విపరీతంగా చర్చ జరిగింది. అయితే సోషల్ మీడియాలో తన పట్ల కొందరు చేస్తున్న విమర్శలతో మనస్తాపం చెందినందువల్లే తాను ఉద్యమం నుండి తప్పుకుంటానని ముద్రగడ ప్రకటించడం పై విపరీతంగా సెటైర్లు వచ్చాయి.
కాపు ఉద్యమ సమయంలో పోలీసు కేసు లకు సైతం వెరవకుండా పోరాడిన ముద్రగడ సోషల్ మీడియా పోస్టులకి భయపడి చాప చుట్టేశాడా అని కొందరు ప్రశ్నిస్తే, చంద్రబాబు పోలీసులతో మా ఇంటి ఆడవాళ్ళని తిట్టించాడు అయినా జాతి కోసం నేను జీవితం త్యాగం చేస్తున్నా అని అంతేసి మాటలు చెప్పిన ముద్రగడ ఇప్పుడు ఉద్యమం నుండి తప్పుకోవడం చూస్తుంటే, సర్కస్ లో మాస్టర్ డబ్బులు సంపాదించాక వాళ్ళ ట్రైన్డ్ జంతువులు రెస్ట్ తీసుకునే సందర్భం గుర్తొస్తోంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇంకొందరు మాత్రం, వైయస్సార్ అభిమాని అయిన ముద్రగడ జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నంతకాలం రెస్టు తీసుకుంటారని, జగన్ దిగి పోగానే మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకుని ఉద్యమం మొదలు పెడతాడు అని జోస్యం చెప్పారు.
కొంతమంది వైసీపీ అభిమానులు మాత్రం, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ముద్రగడ ని సైలెంట్ చేయలేకపోయినా జగన్ ముద్రగడ ని మూలకు కూర్చోబెట్టి కలిగాడు అంటూ తమ అభిమాన నేతను పొగిడే ప్రయత్నం చేశారు. అలాగే జనసేన అభిమానులు కొందరు, ముద్రగడ పేరుకి కాపు ఉద్యమం అని పోరాటం చేసినా, ఆయన అసలు లక్ష్యం, తన ప్రియతమ నేత తనయుడిని ముఖ్యమంత్రిని చేయడం, మూడో పార్టీని అంధకారంలోకి నెట్టడం అని విశ్లేషించారు.
ఇలా ఎన్ని రకాలుగా సెటైర్లు విమర్శలు వినిపించినా, కేవలం సోషల్ మీడియా పోస్టులకు భయపడి ముద్రగడ అస్త్రసన్యాసం చేశాడని మాత్రం ఎవరూ నమ్మడం లేదు. కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ముద్రగడ ఉద్యమం నుండి విరమించుకున్నాడు అన్న అభిప్రాయం సర్వత్రా ఏకగ్రీవంగా వినిపిస్తోంది.