భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పేరుతో.. వారికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రూ. 1364 కోట్లు వసూలు చేసిందని… అయినా ఈ సంక్షోభ సమయంలో.. వారిని ఎందుకు ఆదుకోవడం లేదని.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘాటు లేఖ రాశారు. కరోనా విజృంభణ.. ఇసుక కొరత.. లాక్ డన్ వంటి సమస్యల వల్ల.. భవన నిర్మాణ రంగం కుదేలయింది. దానిపై ఆధారపడిన కార్మికులకు .. గత ఏడాది నుంచి పూర్తి స్థాయిలో పనులు లభించని పరిస్థితి ఉంది. తమకు సాయం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు కొంత కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.్.. లేఖ రాశారు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజు.. నేరుగా జగన్‌కే లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందని ఆర్ఆర్ఆర్ తన.. లేఖలో లెక్కలు చెప్పారు. అయితే ఇప్పటి వరకు 330 కోట్లు మాత్రమే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేశారని తేల్చి చెప్పారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని… వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని రికార్డుల సమాచారంతో.. ఎంపీ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొద్ది రోజుల క్రితం… అవ్వా తాతలకు.. రూ. 17750 బాకీ ఉన్నామంటూ.. జగన్‌కు లేఖ రాశారు. పెన్షన్ ఇచ్చే వయసు తగ్గిస్తామని ఇచ్చిన జీవోకి.. అమలు తేదీకి ఆరు నెలల ఆలస్యం అయిందని.. ఆ మధ్య కాలంలో ఒక్కొక్క అవ్వాతా.. రూ. 17750 నష్టపోయారని లెక్క తేల్చి.. అందరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే… పెంచుకుంటూ పోతామని చెప్పిన రూ. 250 కూడా ఇవ్వాలని కోరారు. ఈ లేఖపై.. ఏపీ సర్కార్ స్పందించలేదు. అయితే.. ఆర్ఆర్ఆర్ మాత్రం.. తన లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ సారి భవన నిర్మాణ కార్మికుల కోసం.. రాశారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో..?