ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేటలు అచ్చంగా రామ్ గోపాల్ వర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద, రెండొందలు టికెట్టు పెట్టి, ప్రేక్షకుల నుంచి ఎంతో కొంత గుంజాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు ట్రైలర్కీ టికెట్టు పెట్టి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు.
వర్మ సంధిస్తున్న మరో అస్త్రం `పవర్ స్టార్`. ఈ సినిమా ఎలా ఉన్నా, అందులో ఏమున్నా, పవన్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ చూస్తారని వర్మ ఆశ. షార్ట్ ఫిల్మ్ లా 30 నిమిషాల సినిమా తీసి, జనం మీదకు వదిలి డబ్బులు చేసుకుందామనుకున్నాడు. అయితే.. ఇది పవన్ సినిమా కదా. క్రేజ్ ఎక్కువ. ఆ క్రేజ్ ని ట్రైలర్ నుంచే క్యాష్ చేసుకోవాలని ఆరాట పడుతున్నాడు.
ఓ సినిమా విడుదలకు ముందు దానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ వదలడం చాలా సాధారణమైన విషయం. `పవర్ స్టార్` ట్రైలర్ కూడా వర్మ వదులుతాడు. కాకపోతే ఆ ట్రైలర్ చూడాలన్నా.. డబ్బులు కట్టాలి. ఒక్కో టికెట్కీ పది రూపాయలు సంపాదించినా, చాల్లే.. అనేది వర్మ ఆలోచన. ట్రైలర్ చూస్తే గానీ, సినిమాపై ఓ అంచనాకు రాలేం. జనమంతా ట్రైలర్ చూసి, సినిమా చూడరేమో అన్నది వర్మ డౌటు. అందుకే రేటు పెట్టాడు. వర్మ నుంచి ఏ చిన్న వీడియో వచ్చినా జనం ఆసక్తిగా గమనిస్తుంటారు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. పది రూపాయల టికెట్ అంటే జనాలకు పెద్ద మేటర్ కాదు. కనీసం ఐదారు లక్షలు చూసినా – బడ్జెట్ కేవలం ట్రైలర్ తో సంపాదించుకోవొచ్చు.
ఈ పాడు ఐడియాలు రాజమౌళి లాంటికొస్తే ఇంకేం ఉండేది. ఆర్.ఆర్.ఆర్ టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ లకు టికెట్లు పెట్టి ఉంటే.. ఈ పాటికి ఆయన బడ్జెట్ ఆయనకు వచ్చేద్దును. వర్మని చూసి, మిగిలినవాళ్లంతా ఇలానే ఆలోచిస్తే – ప్రేక్షకుడి జేబు గుల్లయిపోవడం ఖాయం.