ఇప్పుడు ఎవరు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మరో గట్టి ప్రత్యామ్నాయం వచ్చిందని బలంగా నమ్ముతున్నారు. నిర్మాణ సంస్థలు అటువైపే, హీరోల చూపూ అటుకేసే. దర్శకుల ఆలోచనలూ… వాటి కోసమే. వెబ్ సిరీస్ రంగం బలంగా పాతుకుపోతోందన్నది కఠిన వాస్తవం. అయితే…. మన తెలుగు ఆడియన్స్‌కి ఇవి ఎంత వరకూ నచ్చుతున్నాయి? వాళ్లెంత వరకూ అలవాటు పడుతున్నారన్న విషయం ఆలోచించుకోవాల్సిందే.
తెలుగులో ఒక్క వెబ్ సిరీస్ కూడా హిట్టయిన దాఖలా లేదు. ఈమధ్య `లూజర్` అనే వెబ్ సిరీస్ గురించి మాత్రం కాస్త మాట్లాడుకున్నారేమో..? మరి పుట్టగొడుగుల్లా పేరుకు పోతున్న మిగిలిన వెబ్ సిరీస్‌ల మాటేంటి? వాటిలో ఒక్కటీ జనాలకు నచ్చలేదా? నచ్చేలా తీయలేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వెబ్ సిరీస్ సంస్కృతికి తెలుగు ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. భవిష్యత్తులో అలవాటు పడతారా? అన్నదీ సందేహమే. తెలుగు అనే కాదు. సౌత్ ఇండియాలో ప్రేక్షకులంతా వినోదం అంటే పెద్ద తెర అనుకుంటున్నారు. ఇప్పటికీ. దక్షిణాది వాళ్లు మాత్రమే వెబ్ సిరీస్‌లను సీరియస్ గా తీసుకుంటున్నారు. అక్కడ రూపొందించిన వెబ్ సిరీస్‌లకు మాత్రమే మంచి ఆదరణ దక్కుతోంది. హిందీ, లేదా ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లను సబ్ టైటిల్స్ లోనో, డబ్బింగ్ రూపంలోనో చూసుకుని తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు తప్ప, తెలుగులోనే వచ్చిన వెబ్ సిరీస్ లను సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ సినీ గోయర్స్ కూడా.. తెలుగు వెబ్‌లను పట్టించుకోలేదు. దానికి కారణం. కంటెంట్ లేకపోవడమే.
జీ 5, ఆహా లాంటి వేదికలలో తెలుగు వెబ్ సిరీస్‌లు చాలా వచ్చాయి, వస్తున్నాయి. త్వరలో ఇంకా రాబోతున్నాయి. వాటిలో స్టార్లూ మెరవబోతున్నారు. భారీ బడ్జెట్లు ఈ వెబ్ సిరీస్‌లకు కేటాయించబోతున్నారు. క్రిష్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు ఆయా ప్రాజెక్టులను టేకప్ చేయబోతున్నారు. ఇదంతా మంచి మార్పే. కానీ.. వెబ్ సిరీస్ అనే రంగానికి తెలుగు ప్రేక్షకులు అలవాటు పడడానికి ఇంకొంచెం సమయం పట్టడం ఖాయం. బీ, సీ సెంటర్లో ప్రేక్షకులకు వినోదం అంటే సినిమానే. వాళ్లకు ఓటీటీ వేదికలు పెద్దగా తెలీవు. అమేజాన్, నెట్ ఫ్లిక్స్.. ఈ వాతావరణానికి వాళ్లింకా అలవాటు పడలేదు. తెలుగు పరిశ్రమకు బీసీ సెంటర్లు ఆయువు పట్టు. వాళ్లకు నచ్చితేనే సినిమాకు కాసులు కురుస్తాయి. ఓటీటీలో విడుదల చేసిన సినిమాలు సైతం వాళ్లకు చేరడం లేదు. ఇక వెబ్ సిరీస్‌లు ఏం చూస్తారు? తెలుగులో మూకుమ్మడిగా వెబ్ సిరీస్‌లు రూపొందడం ఆనందకరమైన విషయమే. దాని వల్ల చాలామందికి పని దొరుకుతుంది. కానీ.. వాటిని స్వీకరించే ప్రేక్షకుల్ని సిద్ధం చేసుకోవాలి కదా?
ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీస్‌లు తరచూ ఫాలో అయ్యే తెలుగు ప్రేక్షకులకు తెలుగు వెబ్ సిరీస్ లు పెద్దగా ఆనడం లేదు. నెట్ ఫ్లిక్స్, ఆమేజాన్, హాట్ స్టార్‌లు పెట్టేంత పెట్టుబడి తెలుగు ఓటీటీ సంస్థలు పెట్టలేవు. పెట్టుబడి సరే.. వెబ్ సిరీస్ రూపకర్తల ఆలోచనా విధానం కూడా మారాల్సివుంది. వెబ్ సిరీస్ అంటే.. ఓ సినిమా కథని ఏడెనిమిది భాగాలుగా ముక్కలు చేయడం కాదు. వెబ్ సిరీస్ కావల్సిన స్టఫ్ వేరుగా ఉంటుంది. అదేంటో కనిపెట్టడం వాళ్ల ప్రధమ కర్తవ్యం. బోల్డ్ కంటెంట్ పేరుతో శృంగార భరితమైన కథలు రాసుకున్నా ఫలితం లేదు. అలాంటి స్టఫ్ కావాలంటే.. ఎక్కడైనా దొరికేస్తుంది. మంచి కథ, బిగుతైన కథనం, బలమైన పాత్రలు, ప్రతీ ఎపిసోడ్ లోనూ ఓ ఆసక్తికరమైన మలుపు – ఇవన్నీ వెబ్ సిరీస్ లో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాటిని పట్టించుకోకుండా వెబ్ సిరీస్‌లోనూ ఫక్తు ఫార్ములా కథల్ని పట్టుకుని వేలాడితే మాత్రం ఏనాటికీ తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లను అలవాటు చేయలేరు.