మంత్రి పదవి ఇచ్చేందుకు ఎమ్మెల్సీ ఇస్తున్నారని ఆశ పడిన చిలకలూరి పేట నేత.. మర్రి రాజశేఖర్‌కు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ కోటాలో ఖరారు చేసిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయన పేరు గల్లంతయింది. కొయ్యే మోషన్ రాజుతో పాటు.. రాయచోటికి చెందిన ఓ ముస్లిం మైనార్టీ మహిళకు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీట్లను ఖరారు చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా.. ఎమ్మెల్యేల కోటాలో.. మరో స్థానం ఖాళీగా ఉంది. దానికి ఎన్నిక జరిగినప్పుడు… అభ్యర్థిని ఖరారు చేస్తారు.
చిలుకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్.. జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం నచ్చని సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు కానీ..ఆయన నియోజకవర్గంలో పార్టీని గెలిపిస్తే.. మంత్రి పదవిని ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఆయన గెలిపించారు కానీ.. మంత్రి పదవి రాలేదు. ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవిని ఇస్తారేమో ఆని అనుకున్నారు. అందుకే.., ఎమ్మెల్సీ రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. జగన్ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పుకున్నారు. కానీ చివరి క్షణంలో.. మళ్లీఆయన పేరు మిస్సయింది.
మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తే.. మళ్లీ మంత్రి పదవికి ఆయన పోటీ వస్తారన్న ప్రచారం.. వైసీపీలో జోరుగా సాగుతోంది. గతంలో జగన్ హామీ ఇచ్చినందు వల్ల మాట నిలబెట్టుకునేందుకు అయినా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని.. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోనే జోరుగా లాబీయింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజనీ.. బీసీ కోటాలో మంత్రి పదవి కోసం.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఒక వేళ మర్రికి ఎమ్మెల్సీ ఇస్తే.. ఆయన నియోజకవర్గంలో బలం పెంచుకుంటారని.. మంత్రి పదవి ఇస్తే.. తనకు చోటు లేకుం డా చేస్తారని.. ఆమె కూడా పార్టీ నాయకత్వం వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.