సచివాలయం కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కార్కు ఏదీ కలసి రావడం లేదు. కూల్చివేతకు పర్యావరణ అనుమతుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అనుమతులు అవసరమే లేదని వాదించింది. కూల్చివేత నిలిపివేయాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది.. పర్యావరణ అనుమతల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఎలాంటి పర్యావరణ అనుమతి తీసుకోలేదని.. ధర్మాసనం ముందు ఉంచారు. దీనికి సమాధానం ఇచ్చిన అడ్వకేట్ జనరల్.. కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే.. కోర్టు మాత్రం.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని అభిప్రాయపడింది.
ప్రస్తుతం సెక్రటేరియట్ కూల్చివేస్తున్నది.. కొత్తభవనం కట్టడానికి సిద్ధం చేయడానికేనని.. పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే.. నిర్మాణం సమయంలో.. అనుమతులు తీసుకుంటాని ఏజీ వాదించారు. పర్యావరణ అనుమతిపై కేంద్రం వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు..విచారణకు రేపటికి వాయిదా వేసింది. అదే సమయంలో.. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న ప్రభుత్వ తరపు లాయర్ వాదనకు అనుకూలంగా గతంలో ఏమైనా కోర్టు తీర్పులు ఉంటే.. సమర్పించాలని ఆదేశించింది. రేపటి వరకూ.. కూల్చివేతలపై స్టే కొనసాగించింది.
కూల్చివేతలకు పర్యావరణ అనుమతి కావాలా.. వద్దా అన్నది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కేంద్రంపై పడింది. కూల్చివేతలకు అవసరం లేదని కేంద్రం చెబితే… తెలంగాణ సర్కార్ కు రిలీఫ్ లభించే అవకాశం ఉంది. ఒక వేళ.. పర్యావరణ అనుమతి అవసరమే అంటే మాత్రం.. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పటికే.. దీనిపై.. కాంగ్రెస్ నేతలు ఎన్జీటీలో కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.