ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లాల సరిహద్దులపై సిఫార్సు చేసేందుకు కమిటీ నియమించేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ మేరకు.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ జిల్లాను ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు నిర్ణయించారు. అయితే.. అరక జిల్లాను రెండుగా చేయాలని.. ప్రతిపాదనలు ఎక్కువగా ఉండటంతో.. ఇరవై ఆరో జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేయాలని నిర్ణయించారు. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని 4 జిల్లాల్లో… పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి ఉందని.. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జిల్లాల కమిటీ ఏర్పాటు అవుతుంది. సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా గడవు నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేస్తే.. అనేక సమస్యలు వస్తాయన్న అభిప్రాయాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో మార్పుచేర్పులు ఉండాలన్న ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం నియమించిన కమిటీ.. జిల్లాలు తిరుగుతుందా లేక సమాచారం తెప్పించుకుని నివేదిక సిద్ధం చేస్తుందా అన్నదానిపై క్లారిటీ లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ప్రాతిపదికగా… జిల్లాల ఏర్పాటు ఉండాలని జగన్ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే… తమ ప్రాంతానికి జిల్లా కేంద్రం రావాలంటే.. తమ ప్రాంతానికి రావాలని.. ప్రతీ జిల్లాలోనూ నాలుగైదు చోట్ల నుంచి డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ధర్మాన ప్రసాదరావు లాంటి వైసీపీ సీనియర్లు కూడా వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ వ్యతిరేకతనంతటికిని కమిటీ అధిగమించి.. ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది.