మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాం అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్‌పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ముందస్తుగా.. విజయసాయిరెడ్డి ట్వీట్ హింట్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు హయాంలో సైకిళ్లు కొనుగోలు చేశారని.. రూ. పన్నెండు కోట్ల విలువైన సైకిళ్ల కొనుగోళ్లలో ఐదుకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని.. ఎస్కే బైక్స్ అనే కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టినా.. అదే కంపెనీ నుంచి సైకిళ్లు కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు., దీన్ని ప్లాన్డ్గా వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసి.. నెక్ట్స్ శుక్రవారం.. గంటా శ్రీనివాసరావును అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారాన్ని.. ఓ రేంజ్లో చేస్తున్నారు.
గంటా శ్రీనివాసరావుకు సైకిళ్ల కొనుగోళ్లకు సంబంధం ఏమిటో.. విజయసాయిరెడ్డి తన ట్వీట్లో చెప్పలేదు. గంటా శ్రీనివాసరావు విద్యాశాఖమంత్రిగా పని చేశారు. గత ప్రభుత్వం విద్యార్థినులకు సైకిళ్లు ఉచితంగా ఇచ్చింది. అయితే.. అవి విద్యాశాఖ ద్వారా కాకుండా.. సంక్షేమ శాఖ ద్వారా వస్తాయని చాలా మందికి తెలుసు. అయితే.. గంటా శ్రీనివాసరావు ఆ సైకిళ్లను విద్యాశాఖ ద్వారా కొనుగోలు చేయించారేమోనన్న అభిప్రాయం కలిగేలా.. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి.. ఏడాది నుంచి ఇలా టార్గెట్ చేసుకుని ట్వీట్లు చేస్తున్నారు. మొదట్లో .. అన్న క్యాంటీన్ల భవనాలకు వేల కోట్లు ఖర్చు చేశారని.. ఆరోపించారు. అలా టీడీపీ హయాంలో జరిగిన ప్రతీ పని మీద ఆరోపణలు చేశారు. ఇప్పటికీ.. దేనిపైనా పూర్తి స్థాయిలో ఆధారాలు బయట పెట్టలేదు.
కారణం ఏదైనా గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా .. టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధ్యలో ఓ సారి వైసీపీలో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. చివరికి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ.. మధ్యలో ఉండిపోయారు. అయితే.. మంత్రి అవంతితో మాత్రం.. గట్టిగా మాటల యుద్ధం జరుపుతూ ఉంటారు. ఇటీవల.. విశాఖ నుంచి కొన్ని గాసిప్స్ సర్క్యూలేట్ అయ్యాయి. వాటిని సర్క్యూలేట్ చేయడంలో హస్తం ఉందంటూ.. గంటా శ్రీనివాసరావు సన్నిహితుడ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి.. నేరుగా గంటాను గురి పెట్టినట్లుగా ఉందని.. ప్రచారం జరుగుతోంది.