గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోపోతే ఎలా? పరాజయం అనేది విజయానికి నాందిలా మారాలంటే.. తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందే. యూవీ క్రియేషన్స్ ఇప్పుడు అదే పని చేస్తోంది. యూవీ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నా, ప్రస్తుతం `రాధేశ్యామ్`పైనే దృష్టి పెట్టింది ఆ సంస్థ. ప్రభాస్ సినిమా, పైగా భారీ బడ్జెట్. పాన్ ఇండియా క్రేజ్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాజెక్టు విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది. ఫస్ట్ లుక్ విషయంలో ప్రభాస్ అభిమానులు ఎంత ఒత్తిడి చేసినా, తొందర పడలేదు. తమకు సంతృప్తికరంగా అనిపించినప్పుడే ఫస్ట్ లుక్ బయట పెట్టింది.
సంగీత దర్శకుడి విషయంలోనూ అంతే. ఇప్పటి వరకూ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్నది అంతుపట్టలేదు. చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఎవ్వరూ ఖరారు కాలేదు. సాహో విషయంలో చేసిన పొరపాటు `రాధేశ్యామ్` విషయంలో జరక్కూడదని భావిస్తోంది యూవీ క్రియేషన్స్. సాహోకి నలుగురు బాలీవుడ్ సంగీత దర్శకులు పనిచేశారు. ఆర్.ఆర్ కోసం జీబ్రాన్ ని తీసుకున్నారు. దాని రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటలన్నీ హిందీ జనాలకు తగ్గట్టు ట్యూన్ చేసినట్టు అనిపించాయి. దాంతో మన ప్రేక్షకులకు ఎక్కలేదు. `రాధేశ్యామ్` కోసం కూడా బాలీవుడ్ సంగీత దర్శకులనే తీసుకుందామనుకున్నారు. కానీ.. తెలుగు టచ్ విషయంలో క్రితం సారి చేసిన తప్పు రిపీట్ చేయకూడదని యూవీ క్రియేషన్స్ భావిస్తోంది. అందుకే సంగీత దర్శకుల విషయంలో తొందరపడడం లేదు. ఇప్పుడు వాళ్ల దృష్టి రెహమాన్ పై పడిందని తెలుస్తోంది. రెహమాన్‌కి తెలుగు టచ్ తెలుసు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి తెలుసు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, రెహమాన్ క్రేజ్ కొంత వరకూ ఉపయోగపడుతుంది. కానీ.. రెహమాన్ ఫామ్ కోల్పోయి చాలా కాలం అయ్యింది. అందుకే.. రెహమాన్ విషయంలోనూ.. ఆచి తూచి స్పందిస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, సకాలంలో పాటల్ని కంపోజ్ చేసే వాళ్లెవరైనా ఉన్నారా? అంటూ యూవీ ఇప్పుడు ఆలోచిస్తోంది. త్వరలోనే ఆ పేరు బయటకు రావొచ్చు.