తిరుమల, తిరుపతిల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో శ్రీవారి దర్శనాల నిలిపివేత అంశం మరో సారి హాట్ టాపిక్ అయింది. భక్తుల వద్ద నుంచి ఎలాంటి డిమాండ్లు లేవు. దర్శనాలకు యథావిధిగా భక్తులు వస్తున్నారు. అయితే.. అనూహ్యంగా శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు.. రమణదీక్షితులు.. దర్శనాలు రద్దు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకుల్లో 15 మంది అర్చకులకు కరోనా సోకిందని.. మరో 25 మంది అర్చకుల టెస్టుల రిజల్ట్ రావాల్సి ఉందన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. శ్రీవారి దర్శనం నిలిపివేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. టీటీడీ ఈఓ, అదనపు ఈఓ వ్యవహారశైలి అర్చకులకు వ్యతిరేకంగా ఉందన్నారు.
రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో దర్శనాలను నిలిపివేయబోమని ప్రకటించారు. అన్నమయ్య భవన్లో అర్చకులు సమీక్ష నిర్వహించారు. పూజా కైంకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల్లో 140 మంది వరకూ కరోనా సోకినా.. సగానికి సగం మంది కోలుకున్నారన్నారు. దర్శనాలు నిలిపివేసే ప్రసక్తే కాదని స్పష్టం చేశారు.
రమణదీక్షితులు ఏం కోరుతున్నారో .. ప్రభుత్వ పెద్దలకు ఆయనకు అది ఇవ్వలేకపోతున్నారు. ఆలయంపై ఆయన పెత్తనం సాగడం లేదు. అందుకే.. ఇలా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐవైఆర్ కృష్ణారావు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ట్వీట్లను.. రీట్వీట్ చేస్తూ.. తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాట తప్ప.. మడమ తిప్పం అనేది ప్రజలను మభ్య పెట్టడానికేనని.. ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్‌ను రమణదీక్షితులు రీ ట్వీట్ చేశారు. ఇలా వరసుగా.. రణదీక్షితులు.. అవకాశం దొరికినప్పుడల్లా.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.