ఆంధ్రప్రదేశ్ ప్రజల వైద్య ఖర్చును తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్.. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన వారందరికీ.. ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పథకం పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. తాజాగా.. మరో ఆరు జిల్లాల్లో అమలు చేయడం ప్రారంభించారు. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల ప్రజలు కూడా… వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందిస్తారు. గతంలో 1059 రకాల రోగాలకు మాత్రమే.. ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేవారు.
మొత్తం పదమూడు జిల్లాల్లో 7 జిల్లాల్లో ఇప్పటి వరకూ.. ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లుగా అవుతోంది. నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేస్తారు. ఇప్పటికే కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చారు. అయితే ఇప్పుడు తెల్ల కార్డు ఉన్న వారందరికీ.. ఆరోగ్యశ్రీ వర్తింప చేయడంలేదు. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్జులు ఇస్తున్నారు. అవి ఉన్న వారికి మాత్రమే.. వైద్యం అందిస్తారు. కోటిన్నర మందికి కార్డులు పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి … ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు. వీల్చైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ప్రజల సంపాదన పెద్ద ఎత్తున… ఆరోగ్యం మీదే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఏదైనా రోగం వస్తే.. ఆస్పత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఆ స్థోమత ప్రజలకు ఉండటం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించడం గగనంగా మారుతోంది.ఈ పరిస్థితుల్లో.. ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృతం చేయడం ప్రజలకు ప్రయోజనం కలిగించేదే. అయితే.. ఆస్పత్రులు ఈ సౌకర్యాన్ని ప్రజలకు మెరుగ్గా అందించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా సమయంలో.. ప్రజలకు… వైద్యం తప్ప మరే అంశం ప్రయారిటీగా లేదు.