టీవీ9లో నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో రవిప్రకాష్‌కు.. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక వ్యక్తిని వేధించడానికి ఎన్ని కేసులు పెడతారని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎందుకంటే.. రవిప్రకాష్‌పై ప్రస్తుతం నమోదైన ఈడీ కేసు పాతదే. ఆయన సీఈవోగా ఉన్నప్పుడు.. బోనస్ పేరుతో అక్రమంగా నిధులు డ్రా చేశారన్నదే కేసు. గత ఏడాది అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఆయనను కొన్నాళ్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ పొందారు. ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టు.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే.. కొన్ని రోజులు ఆగిన టీవీ9 కొత్త యాజమాన్యం ఈడీ కేసు ద్వారా.. మళ్లీ రవిప్రకాష్‌ను టార్గెట్ చేసింది.
వాస్తవానికి బోనస్‌గా తీసుకున్న డబ్బులు ఒక్క రవిప్రకాష్ మాత్రమే తీసుకోలేదు. సంస్థలోని ఉద్యోగులందరికీ బోనస్ వచ్చింది. అయితే.. రవిప్రకాష్ ను మాత్రమే టార్గెట్ చేశారు. ఈ అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కలుగచేసుకోవాల్సిన అంశాలేమీ లేవు., అయితే.. టీవీ9 కొత్త యాజమాన్యం.. అలా బోనస్‌గా తీసుకున్న సొమ్మును రవిప్రకాష్ విదేశాలకు తరలించారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. దాంతో.. ఈడీ ముందూ వెనుకా ఆలోచించకుండా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదంతా.. మరోసారి అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగమేనని భావించిన రవిప్రకాష్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
టీవీ9 వ్యవస్థాపక సీఈవోగా ఉన్న రవిప్రకాష్‌కు.,. కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు టీవీ9లో షేర్లు ఉన్నప్పటికీ.. ఆయనను అవమానకరంగా బయటకు పంపేశారు. కేసులు పెడుతున్నారు. ఇప్పటికే కొత్త యాజమాన్యం ఆయనపై వివిధ రకాల కేసులు పెట్టింది. తాజాగా ఈడీ కేసులో తెర ముందుకు వచ్చింది. అన్నింటిపై న్యాయపోరాటం చేస్తున్నారు రవిప్రకాష్.