తెలంగాణ సచివాలయ కూల్చివేతకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కూల్చివేతకు ముందస్తుగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని.. కేంద్రం స్పష్టమైన సమాధానం హైకోర్టుకు ఇచ్చింది. సంబంధిత శాఖ అనుమతి ఇంటే చాలని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు.. కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చింది. మిగిలిన కూల్చివేత ప్రక్రియ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఉదయం సుప్రీంకోర్టులోనూ.. తెలంగాణ సర్కార్కు గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణ సచివాలయ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొత్త సచివాలయం కట్టుకోవాలన్నది.. తెలంగాణ సర్కార్ పూర్తిగా అంతర్గత నిర్ణయం అని.. తాము జోక్యం చేసుకోబోమని చెబుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది.
దీంతో.. ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది. ఇక సచివాలయ తొలగింపు ప్రక్రియ శరవేగంగా జరగనుంది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు సాగిన కూల్చివేతలో.. మెజార్టీ తొలగించారు. అయితే.. పర్యావరణానికి హానీ అంటూ.. కొంత మంది కోర్టుకు వెళ్లడంతో.. మొదట మూడు రోజుల పాటు స్టే ఇచ్చిన హైకోర్టు.. కేంద్రం నుంచి సమాధానం కోసం మరో రెండు సార్లు స్టే పొడిగించింది. చివరికి.. కేంద్రం కూడా.. కూల్చడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తేల్చేసింది. ఇతర శాఖల పర్మిషన్లు ఉన్నాయని తెలంగాణ సర్కార్.. కోర్టుకు తెలిపింది.
హైకోర్టు, సుప్రీంకోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ నెలాఖరులోపు.. మొత్తం సెక్రటేరియట్ భవనాలను తొలగించాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటోంది. రేవంత్ రెడ్డి పర్యావరణానికి నష్టం అంటూ ఎన్జీటీలో పిటిషన్ వేశారు కానీ.. కూల్చివేతలపై ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు. దాంతో.. ఆ అడ్డంకి కూడా లేనట్లయింది.