ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పునర్నియామకం కోసం.. గవర్నర్‌ని కలిసి అభ్యర్థించబోతున్నారు. హైకోర్టు స్వయంగా ఈ విషయంలో దిశానిర్దేశం చేయడంతో.. ఆయనకు 20వ తేదీన రాజ్‌భవన్ అపాయింట్మెంట్ ఇచ్చింది. గతంలోనే నిమ్మగడ్డ.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంతో.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తనను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటోందని.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు హైకోర్టు ఆదేశించడంతో.. నేరుగా గవర్నర్‌నే కలిసి.. హైకోర్టు తీర్పును వివరించి.. తనను బాధ్యతలు తీసుకోవాలనే విషయంలో.. సహకరించాలని కోరనున్నారు.
నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వానికే అండగా నిలిచిన గవర్నర్..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం పూర్తిగా గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎస్ఈసీ పదవి రాజ్యాంగబద్ధమైనది. ప్రభుత్వాలు సిఫార్సు చేసినా.. దాన్ని ఆమోదించాలన్న నిబంధన ఏమీ లేదు. అలాంటి అధికారాలు గవర్నర్‌కు ఉండటం వల్లే.. చంద్రబాబు హయాంలో.. ఇతర అధికారికిని సిఫార్సు చేసినప్పటికీ.. అప్పటి గవర్నర్ నరసింహన్.. తన వద్ద చాలా కాలం పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించారు. కొద్ది రోజుల కిందట.. నిమ్మగడ్డను తొలగించిన ఆర్డినెన్స్ మీద సంతకం చేసిన.. గవర్నర్.. అదే సమయంలో.. కనగరాజ్‌ను కొత్త ఎస్ఈసీగా నియమిస్తూ.. తెచ్చిన ఉత్తర్వులపైనా సంతకం పెట్టారు. ఇవన్నీ వివాదాస్పదమయ్యాయి.
నిమ్మగడ్డ ఫిర్యాదుపైనా ఇప్పటి వరకూ సైలెంట్..!
రమేష్‌కుమార్‌ను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించడం.. ప్రభుత్వం పట్టించుకోకపోతూంటంతో… ఇప్పుడు బంతిని హైకోర్టు గవర్నర్ వద్దకు నెట్టింది. అయితే.. రమేష్ కుమార్ ఎపిసోడ్లో గవర్నర్ బిశ్వభూషణ్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని.. సాదాసీదా రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా తెలుస్తుందని.. కానీ గవర్నర్ మాత్రం.. కనీసం న్యాయసలహా కూడా తీసుకోకుండా… గంటల వ్యవధిలోనే సంతకం పెట్టి ఆమోదించారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే కనగరాజ్ నియామకం విషయంలో గవర్నర్.. ఆలస్యం చేయలేదు. ప్రభుత్వం ఫైల్ పంపిన నిమిషాల్లోనే సంతకం చేశారు. అదే సమయంలో… హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని.. నిమ్మగడ్డ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు.
గవర్నర్ న్యాయవ్యవస్థను గౌరవిస్తారా..? రాజకీయాన్నా..?
ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులోనే ఉంది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటారా లేక.. ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం.. ముందుకెళ్తారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పును గవర్నర్ దాటకూడదని.. యనమల వంటి వారు ముందుగానే చెబుతున్నారు. ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు చర్చ. నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతారా.. లేక హైకోర్టు తీర్పును అమలు చేయమని.. ప్రభుత్వానికి సూచిస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అందుకే.. అందరి చూపూ రాజ్‌భవన్ వైపు మళ్లుతోంది.