తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకులకు కరోనా వైరస్ అంటుకుంది. ఇప్పటికి పధ్నాలుగు మంది అర్చకులకు పాజిటివ్‌గా తేలిందని.. మరో పాతిక మంది ఫలితాలు రావాల్సి ఉందని రమణదీక్షితులు ప్రకటించి కలకలం రేపారు. ఆయన దర్శనాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానిపై.. టీటీడీ చైర్మన్ ఫైరయ్యారు. దర్శనాలు నిలిపివేసే ప్రసక్తే లేదన్నారు. అయితే.. ఈలోపే.. షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీవారి పూజా కైంకర్యాలను పర్యవేక్షించే పెద్ద జియ్యంగార్‌కు.. కరోనా పాజిటివ్‌గా తేలింది. టీటీడీలో మిరాశీ విధానం రద్దయిన తర్వాత కైంకర్యాలు నిర్వహించే బాధ్యత జీయంగార్లకు దక్కింది. చిన జియ్యంగార్, పెద్ద జియ్యంగార్ ఉంటారు. మొత్తం వారి చేతుల మీదుగానే సుప్రభాతం సహా.. వివిధ కైంకర్యాలు జరగాలి. ఇప్పుడు పెద్ద జియ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
పెద్ద జియ్యంగార్.. నిన్న కూడా.. శ్రీవారి కైంకర్య విధుల్లో చురుకుగా పాల్గొన్నారు. గురువారం సాలకట్ల ఆణివార ఆస్థానం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనతో పాటు చిన్నజీయర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు పెద్ద జీయర్ తోపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు అందరూ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దజీయర్ కాంటాక్టులందరూ.. టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు రమణదీక్షితులు.. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. బయట పెట్టిన సమయంలోనే.. పెద్ద జీయర్‌కు పాజిటివ్‌గా రావడం.. టీటీడీ బోర్జు పెద్దలకు భారీ షాక్‌లా మారింది.
తిరుమల కొండకు వస్తున్న భక్తులకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని… టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ 140మందికిపైగా ఉద్యోగాలు కరోనా బారిన పడ్డారు. వారందరికీ ఎలా సోకిందన్న ప్రశ్నలు ఇతరుల వైపు నుంచి వస్తున్నాయి. భక్తుల నుంచే.. అర్చకులకూ సోకి ఉంటుందని..అంటున్నారు. ఇప్పుడు.. టీటీడీ దర్శనాల నిలిపివేతపై… తక్షణం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద జియ్యంగార్‌కు కరోనా వచ్చిన తర్వాత దర్శనాలు కొనసాగించే పరిస్థితి ఉండదని.. టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.