నర్సాపురం ఎంపీపై అనర్హతా వేటు వేయిస్తామంటూ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు.. చివరికి ఆయన సీటు మార్పించి సంతోషపడ్డారు. ఇప్పటి వరకూ లోక్‌సభలో రఘురామకృష్ణరాజుకు 379వ నెంబర్ సీటులో కూర్చునేవారు. ఇప్పుడు.. ఆయనను మరింత వెనక్కి నెట్టి..445 నెంబర్ సీటులో కూర్చునేలా చేయగలిగారు. ఈ మేరకు.. వైసీపీ లోక్‌సభా పక్షం అభ్యర్థించడంతో.. స్పీకర్ .. వైసీపీ సభ్యుల సీట్లలో మార్పులు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం.. రఘురామకృష్ణరాజు ఇప్పటి వరకూ కూర్చున్న 379 సీటులో ఇక నుంచి మార్గాని భరత్ కూర్చుంటారు. ఆయన కూర్చున్న 385 నెంబర్ సీటులో కోటగిరి శ్రీధర్, ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుకు కేటాయించిన 445 సీటులో ఇప్పటి వరకూ కూర్చుంటున్న బెల్లాన చంద్రశేఖర్ 421 నెంబర్ సీటులో కూర్చుంటారు. అంటే.. రఘురామకృష్ణరాజు.. చివరి వరుసలకు వెళ్తారన్నమాట.
కొద్ది రోజులుగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి… నర్సాపురం ఎంపీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన పార్టీకి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారంటూ.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. దానిపై.. రఘురామకృష్ణంరాజు.. అటు ఎన్నికల కమిషన్ వద్ద.. ఇటు హైకోర్టులోనూ.. న్యాయపోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్ పేరును.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని…తాను.. వైఎస్ఆర్ పార్టీ తరపున గెలవలేదని చెబుతూ వస్తున్నారు. చివరికి పేరుకే టెండర్ పెట్టే ప్రయత్నం చేయడంతో.. వైసీపీ అగ్రనాయకత్వం.. ఆయనపై అనర్హతా వేటుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే స్పీకర్‌కు పిటిషన్ సమర్పించింది.
అయితే.. ఆర్ఆర్ఆర్ మాత్రం.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాను పార్టీని కాని.. పార్టీ అధ్యక్షుడిని కాని పల్లెత్తు మాట అనడం లేదని అంటున్నారు. అలాగే అనడం లేదు కూడా. దీంతో.. ఆయనపై అనర్హతా వేటు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. చివరికి.. వైసీపీ.. సీటు మార్పించి..బదులు తీర్చుకున్నట్లుగా ఉందన్న సైటైర్లు పడుతున్నాయి.