ఓరకంగా ఇది విచిత్రమైన కాంబినేషనే. రామ్ చరణ్ – మెహర్ రమేష్ లు కలిసి ఓ ప్రాజెక్టు చేయడం.. మెగా అభిమానులకు షాకింగ్ విషయమే. చిరు – మెహర్ రమేష్ కాంబోలో ఓసినిమా వస్తుందని ఆ మధ్య బాగా ప్రచారం సాగింది. `నా కోసం మెహర్ రమేష్ ఓ కథ రెడీ చేస్తున్నాడు` అంటూ చిరు కూడా ఆమధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కాంబో చరణ్ – మెహర్ లకు షిఫ్ట్ అయ్యింది. అయితే ఇది సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం.
చరణ్ ఈమధ్య వెబ్ సిరీస్ నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు టాక్. త్వరలో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలని భావిస్తున్నాడు. ఆ బాధ్యత మెహర్పై పెట్టినట్టు తెలుస్తోంది. చిరు తనయ సుస్మిత కూడా వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ప్రాజెక్టుని పట్టాలెక్కించింది. మెహర్ కథ రెడీ చేస్తే.. దాన్ని చరణ్, లేదా సుస్మిత నిర్మాతలుగా పట్టాలెక్కిస్తారు. ప్రస్తుతం మెహర్ రమేష్ ఓ కథని రెడీ చేస్తున్నాడట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇటీవల చిరు కాంపౌండ్ మనిషైపోయాడు మెహర్. చిరుకి సంబంధించిన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందుకే ఈ బంపర్ ఆఫర్ దక్కింది. చిరుతో సినిమా చేద్దాం అనుకున్నాడు. దానికి ముందు ట్రైలర్ గా ఓ వెబ్ సిరీస్ వదలబోతున్నాడన్నమాట.