ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ .. తనదైన పరిధులు దాటని జర్నలిజం లాంగ్వేజ్లోఅధికార పార్టీలను విమర్శిస్తారు. అందుకే ఆయన ఆర్టికల్స్ కోసం రాజకీయం అంటే ఆసక్తి ఉన్న వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతీ వారాంతంలో వచ్చే కొత్తపలుకులో ఇటీవల… ఆ స్పార్క్ మిస్సవుతోంది. విమర్శిస్తున్నట్లుగా కనిపిస్తున్నా.. మొత్తంగా చూస్తే పొగుడుతున్నారేమో అన్న అనుమానం… రాకుండాపోదు. ఈ వారం.. కొత్తపలుకులో జగన్మోహన్ రెడ్డి… విపక్షాలను అణిచి వేస్తున్న తీరు , ఎవర్నీ నోరెత్తకుండా చేస్తున్న వైనం.. అధికారవర్గాలను.. కోర్టులను సైతం ధిక్కరించేలా మార్చగలగిన నైపుణ్యాన్ని పరోక్షంగా ప్రశంసించారు. పైకి మాత్రం.. నిష్ఠూరమాడినట్లుగా కనిపించారు కానీ.. ఆయన అంతిమంగా జగన్‌ను పొగిడినట్లు అర్థం చేసుకోవచ్చు.
అంత కంటే ముఖ్యమైన విషయంలో… కేసీఆర్‌తో పోల్చి.. జగన్మోహన్ రెడ్డిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని.. ప్రచారం చేసుకోవడంలో వెనుకబడ్డారని.. కానీ జగన్ మాత్రం.. అలా లేదని.. చురుగ్గా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏవో పథకాలు పెట్టి.. పాత పథకాలను తీసేసి… జనం ఖాతాలలో జగన్ డబ్బు వేస్తున్నారని.. తమకు ఎంతో కొంత సొమ్ము వస్తుంది కదా అని ప్రజలు కూడా సంతోష పడుతున్నారని తీర్మానించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్లో చాలా వరకు.. వ్యతిరేకంగా విశ్లేషించినట్లుగా కనిపించినా ప్రస్తుత రాజకీయాల్లో ఆయన లాగే ఉండాలన్నట్లుగా .. ఆర్కే చెప్పడం.. ఆర్టికల్‌లో దాగున్న అంతరార్థంగా భావించవచ్చు.
అధికారుల్ని జగన్ శంకరగిరి మాన్యాలను పట్టిస్తున్నారని.. విధేయుల్ని దూరం పెడుతున్నారని.. ఆర్కే చేసిన విశ్లేషణ కూడా.. నెగెటివ్ కోణంలో లేదు. పీవీ రమేష్… వైసీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజు… పార్టీ వర్థిల్లాలి అని ట్వీట్ చేశారు. అలాంటి అధికారినే జగన్ పక్కన పెట్టారంటే.. సమర్థుల్ని మాత్రమే నెత్తిన పెట్టుకుంటారన్నట్లుగా… ఆర్కే పరోక్ష అర్థాన్ని తీసుకు వచ్చారు. అసలు ఆ అధికారుల్ని ఎందుకు దూరం పెడుతున్నారో.. విశ్లేషించాల్సిన ఆర్కే.. దాని జోలికి పోలేదు. అధికారవర్గాల్లో అసలేం జరుగుతుందో చెప్పలేదు.. వారంతా… జీ హూజూర్ బ్యాచ్ అయినా.. ఎక్కడ విశ్వాసం కోల్పోయారో.. వివరించలేకపోయారు.
అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల్లో అవినీతికి ఆర్కే ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అలాంటిది.. ఈ సారి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఆ డబ్బులు సూట్ కేసు కంపెనీల ద్వారా.. విదేశాలకు పంపుతున్నారని టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. జే ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన సొమ్మును.. ఇలా తరలిస్తున్నారని అంటోంది. మామూలుగా అయితే.. ఆర్కే.. ఇలాంటిది దొరికినప్పుడు చిలువలు పలువలుగా రాసి చూపిస్తారు. కానీ ఈ సారి మాత్రం.. ఆ జోలికి వెళ్లలేదు. .. మొత్తంగా.. కొత్తపలుకులో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోందని భావించవచ్చు.