తెలంగాణ డీజీపీ హఠాత్తుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దండకారణ్య ప్రాంతాల్లో కూడా మహేందర్ రెడ్డి ధైర్యంగా వెళ్లి వచ్చారు. గతంలో ఏ డీజీపీ కూడా వెళ్లని ప్రాంతాలకు వెళ్లారు. కొద్ది రోజులుగా తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. ఇటీవల తిర్యాణీ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తూండగా…కొంత మంది ముఖ్యనేతలు తప్పించుకున్నట్లుగా గుర్తించారు. దాంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. మావోయిస్టుల్లో కీలకంగా ఉన్నట్లు భావించే.. బండి ప్రకాశ్, మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ పక్కా సమాచారం అందించింది. దీంతో.. అటవీ ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ ప్రత్యేకంగా వేట సాగిస్తోంది.
ఇటీవల మావోయిస్టు పార్టీ ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు పార్టీ కొత్త జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు తెలంగాణలో బేస్ ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. చత్తీస్ఘడ్ అడవుల కన్నా.. ఉత్తర తెలంగాణ అడవులే బెటర్ అని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. పట్టు సాధించేందుకు అనువైన పరిస్థితులు ఉండటంతో.. మావోయిస్టులు గోదావరి దాటి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కూంబింగ్‌లో ఆ దళాలు బలగాల కంట పడుతున్నాయి. వారం రోజుల క్రితం రెండు విడతలుగా ఎదురుకాల్పులు కూడా జరిగాయి.దీంతో.. మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని పోలీసులు నిర్ణయించారు. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు.
మావోయిస్టులు చాలా కాలంగా స్తబ్దుగా ఉన్నారు. అధికార ప్రతినిధి జగన్ పేరుతో అప్పుడప్పుడు ఓ లేఖ విడుదలవుతుంది. కానీ ఇప్పుడు కదలికలు కూడా పెరగడంతో.. పోలీసులు అన్నింటిపై దృష్టి పెట్టారు. సాధారణంగా మావోయిస్టులు.. కొంత కాలం స్తబ్దుగా ఉన్న తర్వాత.. ఏదైనా ఓ పెద్ద టార్గెట్‌ను పెట్టుకుని.. సంచలనం సృష్టించి వార్తల్లోకి వస్తారు. అందుకే.. అటవీ ప్రాంత ప్రజాప్రతినిధులను పోలీసులు ప్రత్యేకంగా హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.