తమిళనాడు చెక్‌పోస్టులో పట్టుబడిన రూ. ఐదు కోట్ల 27 లక్షల రూపాయల వ్యవహారంపై తమిళనాడులో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఆ సొమ్ము ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదని.. పట్టుబడిన వారు వాంగ్మూలం ఇచ్చారని.. మీడియా ప్రకటించేసింది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం .. ఆ ఆంశాన్ని ప్రభుత్వం కానీ.. పోలీసులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా కాదు.. అసలు పట్టించుకోలేదు. తమకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత .. నగదు చెలామణిపై ఎన్నో నిబంధనలు పెట్టింది. రూ. రెండు లక్షల కన్నా.. ఎక్కువ నగదు లావాదేవీలు చేయడానికే లేదు. అలాంటిది.. రూ. 5 కోట్ల 27 లక్షలు తరలిస్తున్నానని.. బంగారం వ్యాపారిగా చెప్పుకున్న వైసీపీ నేతల నల్లమల్లి బాలు ప్రకటించేసుకున్నారు. కానీ.. ఆయనకు కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు.
అంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతూంటే… ప్రభుత్వానికి పన్నుల రూపంలో.. చాలా ఎగ్గొడుతున్నట్లే లెక్క. దాన్ని జీరో బిజినెస్ అంటారు. ఆ మొత్తం జీరో బిజినెస్ ద్వారా చేస్తున్నట్లుగానే స్పష్టమవుతోంది. కానీ.. ఏపీ అధికారులు మాత్రం.. నల్లమల్లి బాలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో.. సోషల్ మీడియాలో.. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పోస్టులు పెట్టిన వారిపై మాత్రం కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ.. వైసీపీ తీరును అడ్వాంటేజ్‌గా తీసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారంటూ.. ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తీవ్రంగా కొట్టారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. అ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులు తాము కొట్టలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అదే సమయంలో.. టీడీపీ చెన్నైలో రిజిస్టర్ అయిన… సూట్ కేస్ కంపెనీలంటూ.. కొత్త వివరాలను తెరపైకి తీసుకు వచ్చింది. వైఎస్ జగన్ కుటుంబీకులు.. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సూట్ కేసు కంపెనీలు పెట్టారని.. వాటి ద్వారా సొమ్మును విదేశాలకు తరలించి.. మళ్లీ వైట్ రూపంలో ఇక్కడకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. రూ. ఐదు కోట్లు పట్టుబడిన వ్యవహారంలో.. అసలు వివరాలు బయటకు రాకుండా.. ఎదురుదాడికి ప్రయత్నించడం… సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంతో.. టీడీపీ దీన్ని మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుని రచ్చ చేస్తోంది. కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో చర్చ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.