తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ బగీరథ పథకం సూపర్ అని కేంద్రం సర్టిఫికెట్ పంపించింది. ఆ పథకాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని… సూచనలు కూడా చేసింది. ఇలాంటి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఊరుకుంటారు.. చెలరేగిపోవడం ప్రారంభించారు. కేంద్రం హఠాత్తుగా మిషన్ భగీరథను ఎందుకు పొగిడిందో.. దేశం మొత్తానికి ఎందుకు ఆదర్శం అని చెప్పిందో తెలియక.. విపక్ష నేతలు బుర్రగోక్కుంటున్నారు. ఈ లోపు కేసీఆర్ దార్శనికతపై.. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం ఉద్ధృతం చేసుకుంది.
రెండు రోజుల క్రితం.. జాతీయ జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సాహో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ వెళ్లింది. మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించిన ఆయన… ఆ మోడల్లోనే… పయనించి.. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని కోరారు. నిజానికి.. కేంద్రం.. గత బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ అనే పథకం పెట్టింది. తాము ఎప్పుడో దాన్ని అమలు చేశామని … తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు కేంద్రమే దాన్ని అంగీకరించినట్లయింది. తెలంగాణ మోడల్ ని అధ్యయనం చేయడానికి సాంకేతిక బృందాలను పంపాలని కూడా.. సాహో తన లేఖలో అన్ని రాష్ట్రాలను కోరారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రధానంగా చెరువుల్ని బాగు చేసేందుకు మిషన్ కాకతీయ.. ఇంటింటికి నీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాల్ని ప్రవేశ పెట్టారు. కేవలం 9 నెలల అత్యల్ప వ్యవధిలోనే మిషన్ భగీరథ తొలిదశ పనులు పూర్తి చేశారు. తెలంగాణలో ప్రతీ ఊరిలో.. వీధిలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరగడం.. వర్షాలు కూడా బాగా పడుతూండటంతో.. తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలు చాలా వరకు తీరిపోయాయి. ఇది కేంద్రాన్ని ఆకర్షించింది. భేషజాలు లేకుండా.. అన్ని రాష్ట్రాలు ఫాలో కావాలని లేఖ రాసింది. ఈ పథకం అంతా అవినీతి అని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు.. కేంద్రం పంపిన లేఖ…సమాధానంగా టీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది.