తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలం పొడిగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే మొదటి సారి కాదు.. ఏడాది కిందట కూడా.. ఓ సారి పొడిగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కీలక అధికారుల్ని… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే.. తప్పించేసింది. అయితే.. ఒక్క అనిల్ కుమార్ సింఘాల్ మాత్రం.. తన స్థానం నుంచి కదల్లేదు. అంటే.. కదిలించలేకపోయారని అనుకోవాలి. నిజానికి టీడీపీ హయాంలో .. టీటీడీపై వైసీపీ చేసిన రాజకీయంగా.. అనిల్ కుమార్ సింఘాల్‌పైనా వైసీపీ అగ్రనేతలు ఆరోపణలు చేశారు. వైసీపీ ముఖ్యనేతలపై.. టీటీడీ ఈవో హోదాలో.. రూ. వంద కోట్లకు పరువు నష్టం కేసులు కూడా వేయించారు. దీంతో సింఘాల్‌పై వైసీపీ నేతలకు పీకల దాకా కోపం ఉంది.
ఎన్నికల సమయంలో టీటీడీ బంగారాన్ని.. ఓ బ్యాంక్.. తిరుమలకు తీసుకు వచ్చి అప్పగించేందుకు తెస్తున్న సమయంలో.. సోదాల్లో చెన్నైలో పట్టుకున్నారు . దానిపై జరిగిన రగడ అంతా ఇంతా కాదు. అది ఎన్నికల సమయంలో కావడంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ప్రత్యేకంగా విచారణ అధికారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. దాంతో అనిల్ కుమార్ సింఘాల్‌ను తొలగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. మామూలుగా రెండేళ్లే పదవి కాలం. అది ముగిసిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా పొడిగింపు తెచ్చుకుంటున్నారు.
టీటీడీ ఈవో పోస్టుకు.. ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ తర్వాత ఎవరైనా ప్రధానంగా కోరుకునే పోస్టు టీటీడీ ఈవోనే. చంద్రబాబు హయాంలో చాలా మంది అధికారులు పోటీ పడినప్పటికీ.. ఆయన సింఘాల్‌కు చాన్సిచ్చారు. ఉత్తరాది అధికారులకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. అయితే.. ఢిల్లీ స్థాయిలో సిఫార్సుల వల్లే ఆయనను టీటీడీ ఈవోగా నియమించారని చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా.. సింఘాల్‌కు అదే శక్తి అండగా నిలుస్తోందని అంటున్నారు. తాము ఎన్నో ఆరోపణలు చేసిన అధికారిని కదిలించడానికి.. వైసీపీ సర్కార్ కూడా సాహసం చేయలేకపోతోంది. ఈ సారి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ.. ఈవోగా ఉండాలని ఆదేశించింది.