ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులు కూడా దీని బారిన పెద్ద ఎత్తున పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించలేదు. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా… కోవిడ్ బారిన పడుతున్న వారికి కనీస రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే ఏపీలో మొత్తం ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారెవరికీ కనీస మొత్తం పరిహారం కూడా అందలేదు. ప్రభుత్వం తక్షణం జర్నలిస్టులను ఆదుకోవాలనే డిమాండ్లు .. జర్నలిస్టు సంఘాలు వినిపిస్తున్నాయి. కనీసం రూ. 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నాయి.
జర్నలిస్టు సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పని చేసిన వారు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. జర్నలిస్టుల కష్టకష్టాలన్నింటినీ చూసిన వారూ ఉన్నారు. అయితే.. ఎవరూ ప్రభుత్వానికి ఈ దిశగా సలహాలు ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. అయితే.. లోకేష్ ఇలా.. డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా.. తన వంతు ప్రయత్నం కొత్తగా చేశారు. తాను ఇన్చార్జ్‌గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ సొంతంగా బీమా చేయించారు. అన్ని మండలాలు కలిపి అరవై మందికిపైగా జర్నలిస్టులు ఉండటంతో.. వారందరికీ..ఇన్సూరెన్స్ చేయించారు. కరోనా మరణం సహా.. సహజమరణానికి రూ. పది లక్షలు.. యాక్సిడెంట్ అయితే.. రూ. ఇరవై లక్షలు వచ్చేలా ఈ బీమాను చేయించారు.
లోకేష్ ప్రయత్నం జర్నలిస్టుల ప్రశంసలకు కారణం అయింది. ప్రభుత్వం వద్ద..ఇప్పటికీ… కొన్ని ప్రతిపాదనలు పెండింగ్ లో ఉండిపోయాయి. కనీసం.. అక్రిడేషన్లను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు.. ఉన్న అక్రిడేషన్లను పొడిగిస్తోంది కానీ..ఆ విషయం మాట వరుసకే చెబుతోంది. దీంతో.. ఆ అక్రిడేషన్ల వల్ల బస్ చార్జీల్లో రాయితీ కూడా లభించడంలేదు. హెల్త్ స్కీమ్.. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లోకేష్.. మంగళగిరి జర్నలిస్టులందరికీ చేయించిన బీమా.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.