ఆంధ్రప్రదేశ్‌లో తనకు రక్షణ లేదని.. కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కావాలంటూ.. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం తనకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికిందని.. ఆయనను కూడా కలిసి.. తన భద్రతపై విన్నవిస్తానని ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుపై.. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు చేస్తామని.. తమ పార్టీకి చెందిన వారే.. హెచ్చరించారని.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని.. ఇలాంటి సమయంలో.. తాను కేంద్ర బలగాల రక్షణ కోరుకోవడం సమంజసమనేనన్నారు. తన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. తాను కేంద్ర బలగాల రక్షణ కోరుకోవడం… దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. కేంద్ర బలగాల రక్షణ ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు.
రఘురామకృష్ణరాజు.. ఇప్పటికే.. కేంద్ర బలగాల రక్షణ కోసం.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఆ లేఖను.,., స్పీకర్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపారు. ఇంకా ఆ లేఖ పరిశీలనలోనే ఉంది. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ లోపు పలుమార్లు కిషన్ రెడ్డితో పాటు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తోనూ… బీజేపీ అధ్యక్షుడు నడ్డాతోనూ.. రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ముఖ్య నేతల్ని కలిసినప్పుడల్లా.. తనకు కేంద్ర రక్షణ గురించి అడిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. నిర్ణయం మాత్రం ఇంత వరకూ రాలేదు. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీనే… రక్షణ లేదని.. కేంద్ర బలగాల కోసం… ప్రయత్నిస్తూండటంతో.. ఢిల్లీలో చర్చనీయాంశమవుతోంది. ఏపీలో పోలీసులు.. వ్యవహరిస్తున్న తీరు.. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడం.. దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం వంటి అంశాలు హైలెట్ అవుతున్నాయి. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించలేదన్న విషయాన్ని… రఘురామకృష్ణరాజు ఢిల్లీలో వ్యూహాత్మకంగా హైలెట్ చేస్తున్నారన్న అభిప్రాయం.. వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. అయితే ఆయనను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. మరో వైపు.. రఘురామకృష్ణరాజు.. అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరానికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆ మేరకు చెక్ ను ట్రస్ట్‌కు పంపారు.