హైకోర్టు ఆదేశించినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. తనను మళ్లీ… స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగేలా ఆదేశాలివ్వాలని విజ్ఞాపన పత్రం అందించారు. హైకోర్టు తీర్పులను… కూడా ఇచ్చారు. అరగంట పాటు తాను చెప్పినదంతా సావధానంగా గవర్నర్ విన్నారని… సానుకూల నిర్ణయం తీసుకుంటారని.. మీడియాకు పంపిన ప్రెస్‌నోట్‌లో నిమ్మగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో.. నిమ్మగడ్డ లాంఛనం పూర్తి చేసినట్లు అయింది. అయితే.. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే ఆసక్తి ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. నిమ్మగడ్డను మళ్లీ ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. ప్రభుత్వానికి ఇష్టం లేకుండా.. గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వలేని పరిస్థితి.
హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ.. ప్రభుత్వంపై నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఆధారంగానే.. గవర్నర్ ను కలవమని నిమ్మగడ్డను హైకోర్టు సూచించింది. గవర్నర్‌కు నియామకాధికారం ఉంది కాబట్టి… ఆయనే నియమించాలి కాబట్టి..నేరుగా గవర్నర్ అధికారాలను గుర్తు చేస్తూ.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే గవర్నర్ మాత్రం… సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఇటీవల జరిగిన పరిణామాలు ఉన్నాయంటున్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పటికీ సంతకాలు పెట్టడం.. కొత్త కమిషనర్ నియామకానికి ఆమోదం తెలుపడం.. వంటివి కోర్టుల్లోనూ నిలబడలేదు. కోర్టులు ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా తెస్తారని.. విస్మయం వ్యక్తం చేసినా.. రాజ్‌భవన్ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం.. నిమ్మగడ్డను మళ్లీ బాధ్యతలు తీసుకునేలా ఆదేశించాలని.. విపక్ష పార్టీలు.. గవర్నర్‌కు లేఖలు రాశాయి. అధికార పార్టీ.. ప్రభుత్వం తరపున ఏం సిఫార్సు చేసిందో ఎవరికీ తెలియదు. కానీ మాజీ అధికారులతో మాత్రం.. లేఖలు రాయిస్తున్నారు. ఆ విషయాలు సాక్షి పత్రికలో వస్తున్నాయి. ఆ లేఖల ద్వారానే గవర్నర్‌కు ప్రభుత్వ విధానం తెలియచేస్తున్నారని అంటున్నారు. గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన తర్వాత పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకు రావాలని.. నిమ్మగడ్డకు.. హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ లోపు.. గవర్నర్ ఏ నిర్ణయమూ తీసుకోకపోతే.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.