ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు.. రెండు మంత్రి పదవులకు పేర్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. 22వ తేదీన మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో ఖరారు చేశారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఎమ్మెల్సీలుగా.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు, కడప జిల్లాకు చెందిన మహిళా నేత జకియాఖానుం పేర్లను ఖరారు చేశారు. రాయచోటిలో ముస్లిం జనాభా అధికం. అక్కడ ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని జగన్ అనేక సార్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు. కొయ్యే మోషేన్ రాజు..వైసీపీలో చాలా కాలంగా ఉన్నారు.
మొదట్లో మోషేన్ రాజు పేరు ఎక్కువగా వినపించినా.. తర్వాత మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఎంపీగా ఉన్న రవీంద్ర బాబు..వైసీపీలో చేరారు., అయితే ఆయనకు ఎంపీ టిక్కెట్ కానీ.. ఎమ్మెల్యే టిక్కెట్ కానీ ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీనో రాజ్యసభ టిక్కెటో ఇస్తమని హామీ ఇచ్చారు. ఈ కారణంగా ఆయన కూడా.. ఒత్తిడి తీసుకు వచ్చారు. ఓ దశలో ఆయన పేరును పరిశీలించినప్పటికీ.. చివరికి మోషేన్ రాజు వైపే మొగ్గారు. అలాగే.. చిలుకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ పేరును కూడా పరిశీలించారు. మొదట్లోనే ఆయన పేరును పక్కన పెట్టారు.
ఇక మంత్రి పదవులకు… తూ.గో జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ… శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులకు ఖరారు చేశారు. వీరిద్దరూ.. రాజీనామా చేసిన పిల్లి సుభాష్, మోపిదేవి సామాజికవర్గాలకు చెందినవారే. అయితే గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి స్థానాన్ని శ్రీకాకుళం జిల్లాతో భర్తీ చేశారు. దీని వల్ల గుంటూరు జిల్లాకు ఓ పదవి తగ్గిపోయింది. వీరి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ఇరవై రెండో తేదీన ప్రకటించే అవకాశం ఉంది.