ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. ప్రభుత్వాలను మార్చడం. ప్రజాభిప్రాయానికి విలువ లేదు. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. చేతిలో ఉన్న వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం.. అడ్డ దిడ్డంగా ప్రభుత్వాల్ని మార్చేయడం. ఇదే ఇప్పుడు నడుస్తున్న రాజకీయం. ప్రపంచంలోని దేశాలన్ని.. ముంచుకొచ్చిన ముప్పు నుంచి తమ ప్రజల్ని ఎలా కాపాడాలా.. అని కిందా మీదా పడుతుంటే.. మన దేశంలో మాత్రం.. ఎమ్మెల్యేల్ని కొని ప్రభుత్వాల్ని మార్చేయాలనే తపనలో ఉంటారు పెద్దలు. మొన్న కర్ణాటక అయినా.. నిన్న మధ్య ప్రదేశ్ అయినా.. నేడు రాజస్థాన్ అయినా.. రేపు మహారాష్ట్ర అయినా ఇదే చరిత్ర.
ప్రజల ప్రాణాలమీదకొచ్చినా ఆగని బేరసారాల రాజకీయాలు..!
మొన్న కర్ణాటకలో ఏం జరిగిందో నిన్న మధ్యప్రదేశ్‌లో అదే జరిగింది. నేడు రాజస్థాన్‌లో జరుగుతోంది. రేపు మహారాష్ట్రలోనూ జరుగుతుందని.. బీజేపీ నేతలు.. మొహమాటం లేకుండా ప్రకటిస్తున్నారు. ఫిరాయింపుల చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ..బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. మంత్రి పదవులు అనే బెల్లం ముక్కతోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని పడేస్తోంది. ప్రభుత్వాల్ని మార్చేస్తోంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే విధానం ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. జనాభాలో భారత్ కన్నా పెద్ద దేశం చైనాలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోరు. భారత్‌లో మాత్రం ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీల్ని ఎన్నుకుంటే.. వారు పాలకుల్ని ఎన్నుకుంటారు. ఈ ప్రజాస్వామ్య లోపాలు.. ఇబ్బందుల గురించి చర్చించాలంటే.. చాలా పెద్ద టాపిక్ అవుతుంది. మొన్న కర్ణాటక .. నిన్న మధ్యప్రదేశ్..నేడు రాజస్థాన్ ప్రభుత్వాల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు లోపం.. రాజకీయ పార్టీల దగ్గరే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చిందని తెలిసినా.. అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ పార్టీలు రాటుదేలిపోతున్నాయి. దీనికి వారికి ఒకే ఒక్క ఆయుధం..అవసరం అవుతోంది. అదే అధికారం..
ప్రజాతీర్పు మార్చేసి మెజార్టీ లెక్కల్లోకి తెచ్చే రాజకీయ వైరస్..!
కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమిని ఎలా కూలగొట్టి.. బీజేపీ పదవి చేపట్టిందో.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌నూ అలాగే బీజేపీ కూలగొట్టింది. ఇప్పుడు రాజస్తాన్ తర్వాత మహారాష్ట్ర.. అలా నడుస్తూనే ుంటుంది. జ్యాంగం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ ఉల్లంఘించడం లేదు. ఆ చట్టానికి చిక్కకుండా.. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల్ని ఆకర్షించి… రాజీనామాలు చేయిస్తోంది. ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి.. బలాన్ని నిరూపించుకోలేక వైదొలగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఆ తర్వాత తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఉపఎన్నికల్లో మళ్లీ వారిని గెలిపించుకుని.. మంత్రి పదవులు ఇస్తోంది. ఇందులో ఎక్కడా రాజ్యాంగ వ్యతిరేకం లేదు. కానీ నైతికతేనా అన్న ప్రశ్న వస్తోంది. కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ మెజార్టీ సాధించలేదు. కానీ ఇప్పుడు… తమకు కావాల్సిన మెజార్టీకి తగ్గట్లుగా ఇతర పార్టీల సభ్యులతో రాజీనామా లు చేయించి.. తమ పార్టీ తరుపున గెలిపించి అధికారం నిలుపుకున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ పదిహేనేళ్ల పాలన తర్వాత ఓడిపోయింది. కానీ మళ్లీ ఏడాదిన్నరలోనే.. ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా .. కర్ణాటక పద్దతిలోనే మార్చుకుంది.
అప్పుడు కాంగ్రెస్ చేసింది.. ఇప్పుడు బీజేపీ చేస్తోంది..!
ఇతర పార్టీల నేతలు మొగ్గు చూపకపోతే.. భారతీయ జనతా పార్టీ కూడా అడుగు ముందుకు వేసే అవకాశం ఉండేది కాదు. అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పటికీ.. తమకు అంతకు మించిన పదవి వస్తుందన్న ఆశతోనే.. రాజకీయ నేతలు.. దూకుళ్లకు సిద్దమవుతున్నారు. ఇలాంటి నేతలు ఉన్నప్పుడు .. వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో.. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు అదే వ్యూహాన్ని అమలు చేస్తాయి. కాకపోతే.. అధికారంలో ఉన్న వారికి మాత్రమే.. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఈ అడ్వాంటేజ్ ఉంది. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ.. అలాంటివి చాలా చేసింది. అందుకే.. ఇప్పుడు బీజేపీ చేస్తున్నా.. గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కదా అన్న అభిప్రాయమే వినిపిస్తోంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న నష్టాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాయి. కుల, మత , ప్రాంతాల ఆధారంగా పుట్టిన పార్టీల్లో.. ఎదుగుతున్న నేతలు.. ఆయా పార్టీల్లో .. తమకు ప్రాధాన్యత ఉన్నంత వరకే ఉంటున్నారు. అధికారం అనుభవించినంత కాలం.. తాము ఉంటున్న పార్టీ భావజాలమే.. తమ నరనరాన ఉందని మీడియా ఎదుట నిరూపిస్తూ ఉంటారు. కానీ అధికారం పోయిన మరుక్షణం .. వారి భావజాలం… అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది.
ఈ రాజకీయ వైరస్‌కు మందు లేదు..ప్రజల్లో మార్పే నివారణ మార్గం..!
నయా రాజకీయ నేతల వ్యూహలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నాయి. మెజార్టీపై నిలబడే అతి పెద్ద డెమెక్రసీలో .. మెజార్టీ అనే దగ్గరకు చేరుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు కనిపెడుతున్నారు. గతంలో ఫిరాయింపుల నిరోధక చట్టం చేసిన పార్టీలు.. అందులో లొసుగుల్ని కూడా పెట్టాయి. అధికార పార్టీకి ఎలాంటి హానీ జరగకుండా… ప్రతిపక్షాలను తాము చిన్నాభిన్నం చేయవచ్చు కానీ.. విపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ వైపు చూడకుండా ఉండేలా చట్టం చేసుకున్నారు. ఈ చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు అనుభవిస్తోంది. వ్యవస్థల్ని పకడ్బందీగా రూపొందించకపోతే.. తాత్కలిక లాభాలే అలా రూపొందించేవారికి వస్తాయి. తర్వాత వారే బాధితులవుతారు. ఈ రోజు కాంగ్రెస్.. అధికారం మారితే.. రేపు బీజేపీ..! అంతే తేడా..! ఈ రాజకీయ వైరస్‌కు మందు లేదు… కనిపెట్టలేరు కూడా..!