ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు నాలుగైదు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్‌లో కరోనా రాని వారు ఎవరూ ఉండరనే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా లేవనుకున్నారేమో కానీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులందరితో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తంగా వివరాలు తెలుసుకున్నారు. ఐదు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని.. గుర్తించి.. ఆయా జిల్లాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
తెలంగాణలోనూ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని అనుకున్నారేమో కానీ.. అక్కడి గవర్నర్ తమిళిసై యాక్టివ్ పార్ట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు పెద్దగా సహకరించలేదు. దాంతో.. ఆమె సీరియస్‌గా సమీక్షలు చేయలేదు. అధఇకారులు.. గవర్నర్‌కే కాదు.. హైకోర్టు మాటలను కూడా వినడం లేదు. అయితే ఏపీలో మాత్రం.. చురుగ్గా టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రోజుకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల టెస్టులు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే.. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే.. కేసులు పెరుగుతూ ఉండటంతో.. గవర్నర్ సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఏపీలో… మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో.. 62 మంది కరోనా కారణంగా చనిపోయారు. మొత్తం ఒక్క రోజులో పాజిటివ్ కేసులు 4944గా నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 32336 యాక్టివ్ కే్సులు ఉన్నాయి. మొత్తం మరణాలు 758గా లెక్క తేలాయి. పరీక్షలు చేస్తున్నప్పటికీ.. కట్టడి చర్యలు పెద్దగా లేకపోవడమే… కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల అధికారయంత్రాంగం.. లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా… మద్యం షాపులు.. ఇతర వాటికి యథేచ్చగా అనుమతించడంతో వాటి వల్ల ఉపయోగం ఉండటం లేదు.