వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో.. టెస్టింగ్ చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలింది. దీంతో విజయవాడ నుండి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి అపోలో ఆస్పత్రిలో చేరిపోయారు. విజయసాయిరెడ్డికి కరోనా సోకడంతో వైసీపీలో కలకలం ప్రారంభమయింది. కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా.. ఉత్తరాంధ్రలో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడు బయటకు వచ్చినా.. ఎన్ 95 మాస్క్. చేతులకు గ్లౌజులు తప్పని సరిగా వాడతారు. అయితే.. జన సమూహం ఎక్కువగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం.. సోషల్ డిస్టెన్స్ లాంటివి పాటించకపోవడంతో… ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి కాంటాక్ట్ లో ఉన్న వారు కూడా.. ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ముఖ్యమంత్రిని కలవలేదని… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. మంత్రివర్గంలో ఇద్దర్ని చేర్చుకోవడం… ఎమ్మెల్సీలుగా ఎవరెవర్ని.. ఎంపిక చేయాలన్నదానిపై.. అంతర్గత సమావేశాలు నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. వైసీపీ ఉన్నత నేతల్లో.. కొంత మంది టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుండి.. విజయసాయిరెడ్డి ఎప్పుడూ నిబంధనలు పట్టించుకోలేదు. ఆయన హైదరాబాద్.. విజయవాడ.. విశాఖ మధ్య తిరుగుతూనే ఉండేవారు. అయితే.. కరోనా పెద్దగా లేని సమయంలో.. ఎఫెక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఏపీలో.. వేల కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ కూడా ఎత్తివేయడంతో ఆయన తగ్గలేదు. ఫలితంగా… వైరస్ బారిన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. పార్టీ నేతలు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.