ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ .. జగన్మోహన్ రెడ్డి బాటలో పయనిస్తున్నారు. ఢిల్లీ ప్రజలందరికీ రేషన్ సరుకులకు ఇంటింటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా బ్యాగుల్లో బియ్యం. గోధుమలు, పంచదార వంటి.. నిత్యావసర వస్తవుల్ని కార్డు దారుల ఇంటికే తీసుకెళ్లి ఇస్తారు. రేషన్ దుకాణాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి తీసుకోవడమా.. డోర్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవడమా అన్నదాన్ని ఢిల్లీ ప్రజలకే ఇవ్వనున్నారు. టెండర్లు ఇతర ప్రక్రియలు పూర్తి చేసి.. ఆరేడు నెలల్లో అమల్లోకి తీసుకు రావాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి… ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అందులో రేషన్ బియ్యం పంపిణీ కూడా ఉంది. అందుకే.. పటిష్టమైన వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. గోతాలు కూడా డిజైనా చేశారు. ఇప్పటికే శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు. అయితే.. గోతాలు.. ఇతర సమస్యల కారణంగా ఇప్పటికే శ్రీకాకుళంలో కూడా అంతంతమాత్రంగానే అమలవుతోంది. సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.
మొదట రూ. 750 కోట్ల బడ్జెట్తో సంచులు కొనాలని నిర్ణయించింది. ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలనుకుంది. నిధులు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చింది. తర్వాత సమస్యలు వస్తాయని ఇంటి దగ్గరే వాలంటీర్లు కొలిచి ఇచ్చే విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా వాహనాలను డిజైన్ చేశారు. అందులో రేషన్ బియ్యం పోసుకుని.. వాలంటీర్లు.. లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్తారు. వారి ముందే కొలిచి బియ్యం… గోతంలో పోస్తారు. మొత్తం పదమూడు వేల వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
వైరస్ విజృంభిస్తున్న సమయంలో.. ప్రజల్ని వీలైనంత వరకూ ఇళ్లకే పరిమితం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. గుమికూడే పరిస్థితుల్ని నివారించాలనుకుంటున్నాయి. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన.. పథకాల డోర్ డెలివరీని.. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కేజ్రీవాల్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు.