టీడీపీ ఓడిపోవడంతో.. వైసీపీలో చేరిపోయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు అక్కడ పరిస్థితులు కలసి రావడం లేదు. యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ ఓ పదవి ఇచ్చి సైలెంట్ చేశారు కానీ.. వైఎస్ భారతి బంధువును అంటూ.. శివభరత్ రెడ్డి అనే నేత వచ్చి హడావుడి చేస్తూండటం ఇప్పుడు.. వంశీకి ఇబ్బందికరంగా మారింది. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేత దుట్టా రామచంద్రరావు. గత ఎన్నికల్లో పోటీకి సిద్ధపడకపోవడంతో.. ఎన్నారై అయిన యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ చాన్సిచ్చారు. పదవి తీసుకుని యార్లగడ్డ వెంకట్రావు సైడ్ అయిపోవడంతో.. దుట్టా రామచంద్రరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ సారి ఆయన అల్లుడిని రంగంలోకి దించారు.
హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్వహిస్తున్న శివభరత్ రెడ్డి దుట్టా రామచంద్రరావు అల్లుడు. ఆయన వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువని చెబుతున్నారు. ఆయన కు రాజకీయ భవిష్యత్ మీద ఎవరైనా హామీ ఇచ్చారో లేక.. ఆయనే ఆశ పడ్డారో కానీ.. హైదరాబాద్ ఆస్పత్రిని వదిలేసి… గన్నవరంలో ల్యాండయ్యారు. వచ్చినప్పటి నుండి .. తన మామ దుట్టా వర్గాన్ని దగ్గరకు తీసుకుంటున్నారు. అందుకు దుట్టా కూడా సహకరిస్తున్నారు. శివభరత్ రెడ్డి దూకుడుగా ఉంటూండటంతో.. వైసీపీ శ్రేణులకు నచ్చుతోంది. వంశీతో వెళ్లడం ఇష్టం లేని వారంతా ఆయన వైపు చూస్తున్నారు. అధికారులు కూడా.. శివభరత్ రెడ్డి మాటలు వింటున్నారు. కొద్దికొద్దిగా ఆయన పట్టు పెంచుకుంటూ పోతున్నారు. ఈ లోపు దుట్టా రామచంద్రరావు.. ఉపఎన్నిక వస్తే.. తామే రంగంలోకి ఉంటామని.. హైకమాండ్ కు నేరుగా చెబుతున్నారు.
కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డికి దుట్టా ఈ మేరకు స్పష్టమైన సంకేతం పంపారు. ఈ పరిణామాలు… ఎమ్మెల్యే వంశీకి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేసి గెలవాలనుకుంటున్న ఆయనకు .. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పరిస్థితి చూస్తే… రాజీనామా చేసిన తర్వాత టిక్కెట్ ఇస్తారా లేదా .. అన్న చర్చ కూడా… నియోజకవర్గంలో ప్రారంభం అయింది.