దేవాదాయశాఖకు చెందిన నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించిన విషయంపై భారతీయ జనతా పార్టీ ఏపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రభుత్వం తక్షణం ఆలయాల హుండీల సొమ్మును .. మళ్లీ ఆయా ఆలయాలకు.. దేవాదాయశాఖకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. అందుకే.. రూ. 25 కోట్లను దేవాదాయశాఖ దగ్గర నుంచి తీసుకుంటూ.. జీవో జారీ చేసిందని ఢిల్లీలో ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ ఏపీ ముఖ్యనేతలు ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ… ఈ మేరకు ఘాటు విమర్శలు చేశారు. కన్నా దేవాదాయశాఖ నిధులను వెనక్కి ఇచ్చేయాలని లేఖ కూడా రాశారు.
అమ్మఒడి పథకానికి నిధులను సర్దుబాటు చేయడానికి ఏపీ సర్కార్ తంటాలు పడింది. వివిధ శాఖల నుంచి నిధులను మళ్లించింది. కార్పొరేషన్లకు కేటాయించి.. వాటిని అమ్మఒడి కింద సర్దుబాటు చేసింది. అలాగే.. దేవాదాయశాఖ నుంచి రూ.24 కోట్ల 24 లక్షలను మళ్లీంచింది. దీని కోసం జీవో నెంబర్ 18 ని విడుదల చేసింది. ఈ విషయం కొంత కాలం సీక్రెట్‌గా ఉంది.ఇప్పుడు.. విషయం తెలియడంతో.. రాజకీయంగా కలకలం ప్రారంభమయింది. దేవాదాయ శాఖ నిధులు భక్తులు తమ జేబులో నుంచి భక్తితో హుండీలో దేవాలయ అభివృద్ధికి, ధర్మ పరిరక్షణ కోసం వేస్తారని… . ఆ నిధులను ఈ రకంగా ఇతర శాఖలకు బదలాయించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు… ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు.
నిజానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవాదాయశాఖ నిధులను మాత్రం ప్రభుత్వాలు మళ్లించవు. భక్తులు భక్తితో హుండీలో దేవాలయ అభివృద్ధికి, ధర్మ పరిరక్షణ కోసం వేస్తారు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడానికి కాదు. అది దేవుడి సొమ్ము. ఆ సొమ్మును తీసుకోవడానికి ప్రభుత్వాలు కూడా సిద్ధపడవు. కానీ.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం అలాంటి మెహమాటలేమీ పెట్టుకోలేదు. అదే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇతర మతాల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరా.. అంటూ బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి దేవాదాయ శాఖకు కేటాయింపులు చేయదు.. కానీ తీసుకోవడం ఏమిటన్న ప్రశ్న హిందూ సంస్థల నుంచి కూడా వస్తున్నాయి.
ఈ విషయంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. బ్రాహ్మణ కార్పొరేషన్ హోదాలో తెర ముందుకు వస్తున్న మల్లాది విష్ణు… బీజేపీ నేతలు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు అంటున్నారు కానీ.. దేవాదాయ శాఖ నుంచి నిధులు మళ్లించిన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. కన్నాను.. వ్యక్తిగతంగా విమర్శించి.. టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది .. దేవాదాయ నిధులపై మరింత చర్చకు కారణం అవుతోంది.