మంత్రులుగా రాజీనామాలు చేసి.. రాజ్యసభకు ఎన్నికలయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ స్థానాల్లో అదే సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చాన్సిచ్చారు జగన్మోహన్ రెడ్డి. పిల్లి, మోపిదేవి మండలి సభ్యులుగా ఉండగా.. వీరు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే నిబంధన పెట్టుకున్నప్పటికీ.. అదే సామాజికవర్గాలకు చాన్సివ్వాలన్న లక్ష్యంతో మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో చోటిచ్చారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ వీరి చేత.. ప్రమాణస్వీకారం చేయించారు. చాలా పరిమిత సంఖ్యలో వచ్చిన అతిధుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారు. రామచంద్రాపురం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినప్పటికీ.. జగన్ మంత్రివర్గంలో చోటిచ్చారు. ఇప్పుడు.. ఆయనను రాజ్యసభకు పంపడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు జగన్ చాన్సిచ్చారు. ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాకే చెందిన నేతలు కావడంతో బ్యాలెన్స్ అయింది. ఇక పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కూడా మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు. మోపిదేవి వెంకటరమణ కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు. అయితే.. గుంటూరు జిల్లా పదవి సిక్కోలుకు దక్కినట్లయింది.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రోడ్లు భవనాలు.. సీదిరి అప్పలరాజుకు.. మత్స్యశాఖ ఇస్తారనిప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పిల్లు సుభాష్ ఉపముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన .. హోదా ఇక నుంచి ధర్మాన కృష్ణదాస్‌కు ఇస్తారు. ఉపముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం అంటూ ఉండదు కాబట్టి… ఎలాంటి ప్రమాణస్వీకారం చేయలేదు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది., సామాజిక సమీకరణాల విషయంలో.. జగన్ లెక్క తప్ప కూడదని..జగన్ భావిస్తున్నట్లుగా ఈ పదవుల పంపకంలో తేలిపోయింది. అనేక మంది నేతలు..మంత్రి పదవి కోసం ఒత్తిడి తెచ్చినా… లెక్కలోకి తీసుకోలేదు.