భారతీయ జనతా పార్టీ – జనసేన .. పేదల ఇళ్ల కోసం ఉద్యమం ప్రారంభించాయి. కట్టిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలనేది ఆ రెండు పార్టీల డిమాండ్. ఏపీలో గత ప్రభుత్వం దాదాపుగా పది లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసింది. చాలా వరకు కేటాయింపులు పూర్తి చేసింది. కొంత మందికి పత్రాలు కూడా అందించింది. అయితే.. కొత్త ప్రభుత్వం వాటిని లబ్దిదారులకు ఇవ్వడం లేదు. అవి ఇవ్వకుండా.. సెంటున్నర స్థలం ఇస్తామంటూ.. హడావుడి ప్రారంభించింది. దాంతో ఆ ఇళ్లు పాడుబడిపోతున్నాయి. వీటిని లబ్దిదారులకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ.. ఈ నెల మొదట్లో మూడు రోజులు నిరసనలు చేపట్టింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా.. భారతీయ జనతా పార్టీ – జనసేన … ఆ పోరాటంలోకి వచ్చాయి. పేదలకు ఇళ్లను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పోరాటం ప్రకటించారు.
సహజంగా ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులన్నీ కేంద్రం నిధుల సాయంతోనే నడుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత భరిస్తూ ఉంటుంది. అందుకే.. బీజేపీ నేతలు.. నిరసన దీక్షలు ప్రారంభించారు. ఢిల్లీలో జీవీఎల్, సునీల్ ధియోధర్ లు తమ ఇళ్లలో తాము దీక్షకు కూర్చుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే.. ఏపీలో మాత్రం.. ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేరు. ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేతలు.. ప్రెస్మీట్ పెట్టి.. ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసి సైలెంటయ్యారు. ఇతర నేతలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు జనసేన నేతల జాడేలేదు. ఎవరూ దీక్షల్లో పాల్గొన్నట్లుగా కూడా కనిపించలేదు. పవన్ కల్యాణ్ మంగళవారం ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరూ దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే పెద్దగా ప్రభావం కనిపించలేదు.
ఎన్నికల తర్వాత జనసేన సొంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగాపోరాటాలు చేసింది. అయితే.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పరిస్థితి తేలిపోయింది. ఉమ్మడి పోరాటాల సంగతి మర్చిపోయారు. విడివిడిగా చేద్దామంటే.. కలిసే చేయాలనే ఒప్పందం ఉంది. దీంతో.. రెండు పార్టీలు.. కరోనా సాకుగా చెప్పి..ప్రభుత్వంపై పోరాటాన్ని మానుకున్నాయి. అప్పుడప్పుడు ప్రకటనలు మాత్రమే ఇస్తున్నాయి. చాలా రోజుల తర్వాత తొలి సారి… ఇళ్ల కోసం.. నిరసన దీక్షలు చేపడితే.. దాన్ని కూడా క్యాడర్ లైట్ తీసుకుంది.