ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే చర్యలు ఊహాతీతం అన్నట్లుగా ఉంటాయి కానీ.. పక్కా ప్రణాళికతో చేస్తున్నారని కొన్ని ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో.. విజయనగరం జిల్లాలో బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సన్నాహాలు చేశారు. 2703 ఎకరాలు సేకరించి.. జీఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దానిపై వైసీపీ అదే పనిగా ఆరోపణలు చేసింది. ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకు ఎందుకు ఇవ్వలేదని.. ప్రశ్నించారు. అవినీతే అవినీతి అని ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చాక.. జీఎంఆర్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ కొనసాగించారు. అయితే.. వారికి గత ప్రభుత్వం కేటాయించిన ఐదు వందల ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకున్నారు. అంటే తగ్గించి విమానాశ్రయ నిర్మాణానికి ఇచ్చారు.
ఆ ఐదు వందల ఎకరాలు ఆషామాషీగా తగ్గించలేదు. అక్కడేం కట్టాలో ముందుగానే డిసైడైపోయిన తర్వాతే… జీఎంఆర్‌కు ఐదు వందల ఎకరాలు తగ్గించి ఒప్పందం చేసుకున్నారు. కరోనా కాలంలోనే జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ సమయంలోనే… విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ కు ఆ ఐదు వందల ఎకరాల అభివృద్ధి బాధ్యత ఇచ్చేశారు. వీఎంఆర్డీఏ పేరుతో.. ప్రభుత్వ పెద్దలు మిగతా పని పూర్తి చేస్తున్నారు. మే నెలలో భోగాపురం నుంచి మధురవాడ వరకు ఎలా అభివృద్ధి చేయవచ్చో “స్ట్రాటజిక్ కాన్సెప్ట్ ప్లాన్” కోసం టెండర్లు పిలిచారు. మొదటి సారి ఎవరూ రాలేదు. రెండో సారి మాత్రం. గుజరాత్‌కు చెందిన డిజైనింగ్ సంస్థకు ఆ బాధ్యత అప్పగించారు. అందులో ప్రధానంగా.. ఆ ఐదు వందల ఎకరాలు ఎలా వాడుకోవచ్చనేదే కీలకం. ఆ గుజరాత్ సంస్థ యజమానిని తీసుకుని సీఎంవో కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్… రెండు, మూడు సార్లు.. ఆ భూముల్లో పర్యటించారు కూడా..!
ప్రభుత్వ వ్యూహం చూస్తూంటే.. విమానాశ్రయానికి తగ్గించి.. తీసుకున్న ఐదు వందల ఎకరాల్లో పరిపాలనా రాజధాని కట్టినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం… అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే.. బోగాపురానికి రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోడ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. విశాఖలో ఎక్కడా పెద్దగా స్థలాలు అందుబాటులో లేకపోవడంతో.. బోగాపురంలోనూ కాస్తంత రాజధాని సర్దుబాటు చేయనున్నట్లుగా తాజా పరిణామాలు ఉన్నాయన్న అభిప్రాయం.. అందరిలోనూ వ్యక్తమవుతోంది.