ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు చేస్తుందో.. ఆర్బీఐకి కూడా తెలియడం లేదు. మార్కెట్ రుణాలు మొత్తం ఆర్బీఐ లెక్కల్లో ఉంటాయి. కానీ ప్రభుత్వం కొత్త కొత్త పద్దతుల్లో అప్పులు చేస్తోంది. సాధారణంగా.. ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితుల మేరకు అప్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అప్పులను ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా.. తీసుకోవచ్చు. కరోనా కారణంగా పరిమితిని పెంచడంతో.. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఉపయోగించుకుని అప్పులు తీసుకుంటోంది. ఆ బాండ్ల వేలం ఆర్బీఐనే వేస్తుంది. అంటే బహిరంగ మార్కెట్ రుణాల వివరాలు ఆర్బీఐ దగ్గర ఉంటున్నాయి. కానీ ప్రభుత్వం బ్యాంకుల వద్ద.. కార్పొరేషన్ల పేరుతో.. రకరకాల రుణాలు తీసుకుంటోంది. ఆ వివరాలు మాత్రం.. ఆర్బీఐకి చేరడం లేదు.
గత ఏడాది నుంచి ఈ అప్పుల గురించి ఆర్బీఐకి సమాచారం లేకపోవడంతో.. అధికారులు ఏపీ సర్కార్కు పదే పదే లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న అన్ని రకాల అప్పుల వివరాలు స్పష్టంగా తమకు తెలపాలని కోరుతున్నారు. ఆర్థిక శాఖ వర్గాలు మాత్రం ఆ లేఖలను లైట్ తీసుకుంటున్నాయి. సమాచారం పంపడం లేదు. ప్రభుత్వ గ్యారంటీలతో ఆయా కార్పొరేషన్ల నుంచి తీసుకునే వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్” అంటారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా తీసుకుంటోంది. కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేసి మరీ రుణాలు తీసుకుంటోంది. ఇతర అప్పులనూ సేకరిస్తోంది. చివరికి అమెరికా నుంచి ప్రైవేటు ట్రస్టులు అప్పులు ఇస్తాయని.. గ్యారంటీ ఇవ్వాలని నేరుగా కేంద్రాన్నే అడుగుతున్నారు.
మామూలుగా ప్రభుత్వాలు ఏవైనా రూపాయి అప్పు చేసినా… ఆర్బీఐకి సమాచారం పంపాల్సి ఉంటుంది. ఆ నిబంధన తప్పనిసరి . అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. అలాంటి నిబంధనలు పట్టించుకోవడం మానేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎక్కడెక్కడ ఎలాంటి రుణాలు తీసుకున్నారో.. కూడా.. సమాచారం.. ఆర్బీఐకి ఇవ్వడం లేదు. అందుకే ఆర్బీఐ అదే పనిగా లేఖలు రాస్తోంది. అంతకు మించి ఏం చేయలేకపోతోంది.