న్యాయసలహా కోసం ప్రభుత్వం వద్దకు పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు మళ్లీ గవర్నర్ వద్దకు చేరాయి. న్యాయపరంగా అంతా సవ్యంగా ఉందంని.. ప్రభుత్వ న్యాయ విభాగం చెప్పినట్లుగా తెలుస్తోంది. న్యాయశాఖ కూడా.. రాజ్ భవన్ నుంచి వచ్చిన బిల్లులను క్లియర్ చేసి సీఎంవోకు పంపి.. సీఎంవో వాటిని గవర్నర్ వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారన్నదానిపై అంతటా ఆసక్తి ఏర్పడింది. ఒక్క ప్రభుత్వం మినహా… న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులు, విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ.. ఆ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని.. ఆమోదించకూడదనే వాదన వినిపిస్తున్నారు. నేరుగా గవర్నర్కు లేఖల రూపంలో వినతి పత్రాలు కూడా పంపించారు.
ఇప్పటికే అవే అంశాలకు సంబంధించిన బిల్లులు మండలిలో పెండింగ్లో ఉన్నాయి. వాటిని శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపింది. ఆ బిల్లులు అక్కడ ఉన్నప్పుడు అదే బిల్లులను మరోసారి పెట్టడం రాజ్యాంగం విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. సెలక్ట్ కమిటీకి వెళ్లలేదనే వాదన ప్రభుత్వం వినిపిస్తోంది కానీ.., హైకోర్టులో.. స్వయంగా అడ్వకేజ్ జనరల్ ప్రమాణపత్రం దాఖలు చేశారు. దాంతో అది న్యాయపరమైన అంశంగా కూడా మారింది. ఇప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. కోర్టులో వాటికి సంబంధించి వ్యతిరేక తీర్పులు వస్తే.. గవర్నర్ కే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే ఎస్ఈసీ నియామకం విషయంలో గవర్నర్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
పైగా.. విభజన చట్టంలో ఒక్క రాజధాని గురించే ఉంది కానీ.. మూడు రాజధానులని లేదని.. మూడు రాజధానులని ఏపీ సర్కార్ కొత్తగా చట్టం తేవడం.. కేంద్ర చట్టాన్ని సవరించడమేనని.. అలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని అంటున్నారు. కేంద్ర అటార్నీ జనరల్ సలహాలు తీసుకోవాలనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు.. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది అటు ప్రతిపక్షాల్లోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి మంత్రులు.. ఒకటికి రెండు సార్లు గవర్నర్తో భేటీ అయి.. ప్రభుత్వ వాదన వినిపించినట్లుగా ప్రచారం జరుగుతోంది.