చిత్రసీమ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. సినీ పరిశ్రమ తిరిగి పుంజుకోవాలంటే మౌళికమైన మార్పులు చాలా అవసరం. ముఖ్యంగా బడ్జెట్లు తగ్గించుకోవాలి. అలా చేయాలంటే…పారితోషికాల్లో కోత విధించాలి. స్టార్ హీరోలు, దర్శకుల పారితోషికాల్లో 25 శాతం తగ్గించినా, నిర్మాతలకు లాభం చేకూరుతుంది. కానీ… పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఆ ధైర్యం చేసేదెవరు?
దర్శకులైనా, హీరోలైనా.. స్వచ్ఛందంగా ముందుకొస్తే తప్ప ఫలితాలు రావు. ఈ విషయంలో ఇప్పటి వరకూ ఏ అగ్ర హీరో, స్టార్ దర్శకుడు నోరు మెదపలేదు. అయితే.. కొరటాల శివ మాత్రం తన పారితోషికం స్వచ్ఛందంగా తగ్గించుకున్నట్టు టాక్. ప్రస్తుతం `ఆచార్య` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం కొరటాల పారితోషికం ముందే ఫిక్సయిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్టిలో ఉంచుకున్న కొరటాల.. తన పారితోషికం తనకు తానుగా తగ్గించుకున్నాడట. ముందు అనుకున్న పారితోషికం కంటే.. కాస్త తక్కువ ఇవ్వండి అంటూ నిర్మాతలకు చెప్పాడట. పారితోషికం తగ్గించే విషయంలో చరణ్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు గానీ, తానంతట తానే తగ్గించమనడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. మిగిలిన దర్శకులూ, హీరోలూ.. కొరటాల బాటలోనే నడిస్తే – నిర్మాతలకు కొండంత ధైర్యం కలుగుతుంది.