శ్రీవారి దర్శనం కోసం.. రోజూ లక్ష మంది వచ్చేవారు. అప్పట్లో క్యూ లైన్లు.. ఇరవై నాలుగు గంటల పాటూ ఉండేవి. ఇప్పుడు అంతా మారిపోయింది. లాక్ డౌన్ తర్వాత భక్తులను అనుమతిస్తున్నా… అప్పటి సందడిలో కనీసం.. పది శాతం కూడా కనిపించడం లేదు. భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనాల కోసం.. రోజుకు పన్నెండు వేల మందికి చాన్సిస్తామని టీటీడీ ప్రకటించింది. ఆ టిక్కెట్లను ఆన్ లైన్లో ఇస్తోంది. కొన్నాళ్ల పాటు తిరుపతిలోనూ ఇచ్చారు. అయితే.. అలా టిక్కెట్లు పన్నెండు వేలు అందుబాటులో ఉంచినా.. భక్తులు కొండపైక ఆరు వేలకు మించి రావడం లేదు. దీంతో తిరుమల వెలవెలపోతోంది.
తిరుమలలో పెద్ద జియ్యంగార్ సహా పెద్ద ఎత్తున అర్చకులకు.. ఉద్యోగులకు కరోనా సోకింది. అయితే తిరుమలకు వస్తున్న భక్తులెవరికీ కరోనా లేదని.. టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.., దర్శనాలు ఆపడం లేదని చెబుతున్నారు. అన్ని వర్గాల నుంచి దర్శనాల నిలిపివేతకు డిమాండ్లు వస్తున్నా… టీటీడీ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికే.. మూడు నెలల పాటు.. ఎలాంటి దర్శనాలు లేకపోవడంతో.. ఆదాయానికి గండి పడింది. ఇప్పుడు ఆపేస్తే.. మరింతగా ఆర్థిక ఇబ్బందుల్లో పడతామని అనుకుంటున్నారేమో కానీ.. ఆలోచిస్తామని చెబుతున్నారు కానీ.. ఆ పని చేయడం లేదు.
టీటీడీలో పరిణామాలు… తిరుపతిలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల కారణంగా… భక్తులే ఆగిపోతున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్నప్పటికీ.. చాలా మంది.. దర్శనానికి రావడం లేదు. ప్రస్తుతం టీటీడీకి.. రోజువారీ పూజా కైంకర్యాలు అంతరాయం లేకుండా.. పకడ్బందీగా నిర్వహించం సవాల్‌గా మారింది. జియ్యంగార్లు కరోనా బారిన పడటం.. అర్చకుల్లోనూ.. 18 మందికి సోకడంతో.. ఈ ఇబ్బంది తలెత్తింది. కొంత మంది అర్చకులు కరోనా భయంతో విధులకు హాజరు కావడం లేదు. ఇవన్నీ టీటీడీకి కొత్త సవాళ్లుగా మారాయి.