ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్నాయి. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం.. ఆ బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపాలని రాజ్‌భవన్‌ను కోరినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అమరావతికి మద్దతుగా.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.., హిందూ సంస్థలు కూడా.. పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఆరెస్సెస్ సిద్ధాంత కర్తలు.. బహిరంగంగానే అమరావతికి మద్దతు తెలిపారు. అమరావతి ఆలయం కడతామని హిందూ మహాసభ కూడా ప్రకటించింది. అలాగే.. హిందూ మహాసభ.. జాతీయ ప్రధాన కార్యదర్శి.. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు.
మూడు రాజధానుల నిర్ణయం చట్ట విరుద్ధమని.. అమరావతినే కొనసాగించాలన్న హిందూమహాసభ ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొన్న మేరకు…అదనపు వివరాలు పంపాలని గవర్నర్‌కు పీఎంవో సూచించినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందే… హిందూ మహాసభ చేసిన ఫిర్యాదులపై అదనపు సమాచారాన్ని.. ఆ సంస్థ నుంచి.. పీఎంవో సేకరించినట్లుగా చెబుతున్నారు. చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించామని హిందూమహాసభ నేతలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై వివాదం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ కేంద్రం అసలు జోక్యం చేసుకోలేదు. కేంద్రానికి సంబంధించిన బీజేపీ నేతలు.. రాజధాని అంశం.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని చెబుతున్నారు. ఏపీలో మాత్రం.. తాము అమరావతికే మద్దతిస్తామని చెబుతూ వస్తున్నారు. సుజనా చౌదరి లాంటి వాళ్లు కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు కానీ.. వెంటనే ఇతర నేతలు మాత్రం.. అలా జోక్యం చేసుకునే అవకాశం లేదనే మాట కూడా వినిపిస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య.. పీఎంవో.. వివాదాస్పద బిల్లులపై అదనపు సమాచారాన్ని కోరితే… అది అమరావతి ఉద్యమానికి కాస్త ఫలితం ఇచ్చినట్లే అవుతుంది.