జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను ఓ ప్రత్యేకమైన ఇంటర్యూ రూపంలో విడుదల చేశారు. కరోనా కారణంగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయిన పవన్ కల్యాణ్… గోవులు.. పంటలు.. తోటల్లో గడుపుతున్నారు. అయితే.. ఆయన రాజకీయాలను మాత్రం మిస్ కాలేదు. నిరంతరం జనసేన నేతలతో సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. వాటిపై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. చాలా రోజుల తర్వాత.. ఓ ఇంటర్యూ రూపంలో.. ప్రభుత్వ పనితీరు.. రాజకీయాలపై.. తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాజధానుల అంశంపై.. పవన్ కల్యాణ్ గతంలోలానే సూటిగా స్పందించారు. వైసీపీ నయవంచనకు పాల్పడిందదని తేల్చారు. మూడు రాజధానుల అంశం ఎన్నికల సమయంలో కానీ.. అంతకు ముందు కానీ చెప్పి ఉండాల్సిందన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని నమ్మించడం వల్ల.. రైతులు అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారని… జగన్ ముందుగానే మూడు రాజధానుల అంశం గురించి చెప్పినట్లయితే.. రైతులు భూములు ఇచ్చి ఉండేవారు కాదన్నారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగడం కలేనని తేల్చారు. టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులే నలిగిపోతున్నారని … పరిస్థితి ఇంతే ఉంటే.. అమరావతి మరో నందిగ్రాం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
కరోనా వ్యాప్తి ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే కారణమని పవన్ కల్యాణ్ విశ్లేషించారు. సీఎం జగన్ మొదట్లోనే వైరస్‌ను తేలిగ్గా తీసుకోవడంతో.. ప్రజలు కూడా లైట్ తీసుకున్నారని.. ఆ ఫలితమే.. ఇప్పుడు వైరస్ ఏపీలో విపరీతంగా పెరుగుతోందన్నారు. టెస్టుల విషయంలో ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఇటీవల పొగుడుతూ ట్వీట్ పెట్టారు. దానిపైనా స్పందించారు. తాను మనస్ఫూర్తిగానే ఆ ట్వీట్ పెట్టానని.. అయితే… టెస్టుల తర్వాత చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం ఫెయిలయిందన్నారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేవన్నారు.
కట్టిన ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వకపోవడంపై.. బుధవారం… బీజేపీతో కలిసి జనసేన నేతలు దీక్షలు చేశారు. కట్టిన ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వకపోవడం దారుణమన్న పవన్.. ఇళ్ల స్థలాలను.. పేదలనుకొట్టి పేదలకు పంచడం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతినీ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కొన్ని లక్షల ఇళ్లను కట్టిందని.. వాటిని ఇళ్లకపోవడం ఏమిటన్నారు. పార్టీలను చూడొద్దని.. పేదలను మాత్రమే చూడాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఇంటర్యూ పార్ట్ వన్ మాత్రమే.. పార్ట్ టూలో మరికొన్ని కీలకమైన అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది.