పవర్ స్టార్ అన్న టైటిల్ తో ప్రవన్ కళ్యాణ్ అన్న నటుడిని తెరకు పరిచయం చేస్తూ సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై ఈరోజు కొందరు దాడి చేశారు. పవర్ స్టార్ అన్న సినిమా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినది కాదని , ప్రవన్ కళ్యాణ్ అన్న నటుడి తో తీస్తున్న ఈ సినిమా పూర్తిగా కల్పితం అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై దాడి చేసిన వారు తాము జనసేన అభిమానులు అని ప్రకటించక పోవడం తో బహుశా వారు కూడా “జ్రన సేన” అనే వేరే పార్టీ అభిమానులేమో అని సోషల్ మీడియాలో సెటైర్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
మెరుగైన సమాజం కోసం పాటు పడే టీవీ9లో వర్మ సవాల్ – ప్రతిచర్యగా దాడి:
పవర్ స్టార్ అన్న పేరుతో రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో రాంగోపాల్ వర్మ ని పవన్ కళ్యాణ్ అభిమానులు పట్టించుకోకుండా వదిలివేసినా, తనకు కావలసిన ఫలితం అది కాదు కాబట్టి రాంగోపాల్ వర్మ పదేపదే పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టడం ప్రారంభించారు. కొన్ని టీవీ చానల్స్ మద్దతు కూడా తీసుకొని గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టగలిగారు. అయితే నిన్న, మెరుగైన సమాజం కోసం పాటు పడే టీవీ9 ఛానల్ రాంగోపాల్ వర్మ ని సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులను మరింత రెచ్చగొట్టేలా ” దమ్ముంటే తన పై ఎవరైనా దాడి చేయాలని, తన ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ గూగుల్ లో వెతికితే దొరుకుతాయి” అని అని మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న టీవీ9 ఛానల్ లో సవాల్ విసిరారు. ఆయన అలా సవాల్ విసిరారో లేదో ఈ రోజు కొంతమంది జూబ్లీహిల్స్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై దాడి చేశారు. దీంతో నిన్న తమ ఛానల్ లో ఆయన అలా సవాల్ విసరగానే ఇవ్వాళ ఇలా వీరు వచ్చేసారు అంటూ టీవీ9 లో మరొక ప్రోగ్రాం వేసుకున్నారు.
వర్మ కి అనుకూలంగా మీడియా, వర్మపై సెటైర్లు తో సోషల్ మీడియా:
అయితే ఈ సంఘటన పై స్పందించిన రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు తనపై దాడి చేశారని, వారు ఇప్పుడు జైల్లో ఉన్నారని ట్వీట్ చేశారు. అయితే మీడియాలో చాలావరకు రాంగోపాల్ వర్మ కు అనుకూలంగా కవరేజ్ ఇస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం రాంగోపాల్ వర్మ పై, ఆయన్ని మోస్తున్న కొన్ని టీవీ చానల్స్ పై ఒక రేంజ్ లో సెటైర్స్ వినిపిస్తున్నాయి. కత్తి మహేష్, శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ – వీరు ముగ్గురు తుమ్మినా, దగ్గినా దానికి టీవీ9 వంటి చానల్స్ విపరీతంగా కవరేజ్ ఇవ్వడం, వారిని భుజాన ఎత్తుకోవడం కొత్తేమీ కాదని కొందరు అంటుంటే, దమ్ముంటే నా ఆఫీసుకు రండి అంటూ అంతలేసి చాలెంజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ వారు వచ్చినప్పుడు ఎందుకు లోపల దాక్కున్నాడు అంటూ మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు. “నేను ఆఫీసులో ఒక్కన్నే ఉంటా దమ్ముంటే రమ్మనండి, అని చాలెంజ్ చేసి ఆఫీసులో దాదాపు 50 మంది సెక్యూరిటీ ని పెట్టుకుని ఎందుకు రాంగోపాల్ వర్మ ఉన్నాడు” అంటూ మరికొందరు లాజిక్కులు తీశారు. పైగా 50 మందిని ఇంట్లో ఉంచుకోవడం కరోనా సమయంలో నిబంధనల ఉల్లంఘన అంటూ మరికొందరు లాజిక్కులు తీశారు.
వారు జనసేన కాదు “జ్రనసేన ” అభిమానులు అయి ఉండవచ్చు అంటూ సెటైర్:
అయితే అన్నిటికంటే పెద్ద సెటైర్ మాత్రం- ” మీరు తీస్తున్న పవర్ స్టార్ సినిమా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించింది కాకుండా, ప్రవన్ కళ్యాణ్ గురించి అయినప్పుడు, దాడి చేసిన వాళ్ళు ఎక్కడ తాము జనసేన అభిమానులు అని చెప్పుకోలేదు కాబట్టి, వారు కూడా జ్రన సేన అనే వేరే ఏదైనా పార్టీకి చెందిన అభిమానులు అయి ఉండవచ్చు” అని కొందరు సెటైర్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తం మీద, ఏది చేసినా కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో ఆ కాంట్రవర్సీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో రాజకీయ నాయకులు కూడా రాంగోపాల్ వర్మ ని చూసి నేర్చుకోవాలి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.