ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్మించడానికి సిద్ధంగా లేదు కానీ… ఆ భూముల్ని… భవనాల్ని ఎక్కడికక్కడ అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా చురుగ్గా చేస్తోంది. గతంలో బొత్స సత్యనారాయణ… అధికారులు, ఎమ్మెల్యేల కోసం కట్టిన ఇళ్లను… పరిశీలించినప్పుడు.. వాటిని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. తాజాగా.. అమరావతిలో అభివృద్ధి చేయాలనుకున్న స్టార్టప్ ఏరియా కోసం కేటాయించిన పదహారు వందల ఎకరాలను కూడా.. మిషన్ బిల్డ్‌లో భాగంగా అమ్మేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ విషయాన్ని నేరుగా హైకోర్టుకే తెలిపింది.
గత ప్రభుత్వం.. సింగపూర్ కన్సార్షియంతో కలిసి.. స్టార్టప్ ఏరియాను అభివృద్ది చేయాలనుకుంది. చుట్టూ నగరాన్ని అభివృద్ధి పరచడానికి.., వ్యాపార.. వాణిజ్య కేంద్రంగా మార్చడానికి సీడ్ క్యాపిటల్ ఆలోచన తీసుకు వచ్చారు. 1691 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరచాలనుకుంది. అమరావతి అభివృద్ధి సంస్ధతోపాటు ఏర్పాటైన సింగపూర్ కన్సార్టియంలు ఒప్పందం చేసుకున్నాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడి, వైసీపీ అధికారంలోకి రావడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఒప్పందాల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఆ భూముల్ని ప్రభుత్వం అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడమే విశేషం. ఎందుకంటే.., రాజధానిని నిర్మిస్తే… రూ. లక్ష కోట్లకుపైగా ఆదాయం వచ్చే సంపద సమకూరుతుందని …. గత ప్రభుత్వం అమరావతి విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టంగా చెప్పింది. అయితే.. అమరావతి నిర్మాణమే చేసే ఆలోచన లేని ప్రభుత్వం.. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని మాత్రం… అమ్మాలనే ఆలోచన చేయడానికి ఏ మాత్రం మొహమాటపడలేదు. ఓ వైపు.. కొన్ని భూముల్ని… ఇళ్ల స్థలాల పేరుతో.. మరో వైపు.. నేరుగా సీడ్ క్యాపిటల్ భూముల్నే ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
అసలు అమరావతినే కట్టబోమని చెబుతున్న ప్రభుత్వం.. ఆ భూముల్ని అమ్మాలనుకోవడం.. పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తారని అనుకోవడం ఏమిటనే సందేహం కూడా చాలా మందికి వస్తోంది. రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. కానీ వారి భూముల్ని మాత్రం ఇష్టారీతిన అమ్మకాలు.. పంపకాలు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు.